Share News

Tahawwur Rana: పాకిస్థాన్ ఆర్మీకి నమ్మకమైన ఎజెంట్‌ని.. తహవ్వుర్ రాణా వెల్లడి

ABN , Publish Date - Jul 07 , 2025 | 07:47 PM

పాకిస్థాన్‌తో సంబంధాలు కలిగి, ముంబై దాడుల్లో ప్రమేయమున్న అబ్దుల్ రెహమాన్ పాషా, సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ వంటి 26/11 కుట్రదారులు తనకు తెలుసునని తహవ్వుర్ రాణా అంగీకరించాడు.

Tahawwur Rana: పాకిస్థాన్ ఆర్మీకి నమ్మకమైన ఎజెంట్‌ని.. తహవ్వుర్ రాణా వెల్లడి

న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల కేసు (Mumbai Terror Attacks) కుట్రదారుల్లో ఒకరైన తహవ్వుర్ రాణా (Tahawwur Rana) ఎన్ఐఏ (NIA) విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్టు సమాచారం. పాకిస్థాన్ ఆర్మీకి తాను నమ్మకమైన ఏజెంట్‌నని పేర్కొన్నట్టు తెలుస్తోంది.


కువైట్‌పై ఇరాక్ దాడి సమయంలో సీక్రెట్ మిషన్‌పై సౌదీ అరేబియాకు పాకిస్థాన్ తనను పంపిందని రాణా అధికారులకు తెలిపాడు. 1986లో రావల్పిండిలోని ఆర్మీ మెడికల్ కాలేజీలో తాను ఎంబీబీఎస్ పూర్తి చేసి క్వెట్రాలో కెప్టెన్ (డాక్టర్)గా నియమితుడయ్యానని, సింథ్, బలోచిస్థాన్, బహవల్పూర్, సియాచెన్-బలోట్రా సెక్టార్ సహా పాకిస్థాన్‌లోని పలు సెన్సిటివ్ మిలటరీ ప్రాంతాల్లో పనిచేశానని చెప్పాడు. పాకిస్థాన్‌తో సంబంధాలు కలిగి, ముంబై దాడుల్లో ప్రమేయమున్న అబ్దుల్ రెహమాన్ పాషా, సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ వంటి 26/11 కుట్రదారులు తనకు తెలుసునని అంగీకరించాడు. ముంబై పేలుళ్ల కుట్రదారుల్లో ఒకడైన డేవిడ్ హెడ్లీ పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాతో 2003, 2004లో పలు శిక్షణ సెషన్‌లలో పాల్గొన్న విషయం తనకు తెలుసునని చెప్పాడు. అయితే ఆ కోర్సుల పేర్లు తనకు గుర్తులేదన్నాడు. ముంబై ఇమిగ్రేషన్ సెంటర్ ఐడియా తనదేనని, హెడ్లీది కాదని వెల్లడించాడు.


పాకిస్థాన్‌‌కు చెందిన కెనడా జాతీయుడైన 64 ఏళ్ల తహవ్వుర్ రాణా ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన కుట్రదారుగా ఉన్నాడు. కొంతకాలం లాస్‌ఎంజెల్స్ జైల్లో శిక్ష అనుభవించాడు. అతన్ని అప్పగించాలని భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేయడం, అతని రివ్యూ పిటిషన్‌ను అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో రాణా అప్పగింత ప్రక్రియకు మార్గం సుగమమైంది. గత ఏప్రిల్‌లో రాణాను భారత్‌కు అమెరికా అప్పగించింది. ప్రస్తుతం ఆయన ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

పిల్లలతోటే మా ప్రపంచం: బంగ్లా ఖాళీ జాప్యంపై మాజీ సీజేఐ చంద్రచూడ్

దలైలామాకు భారతరత్న ఇవ్వాలి.. కేంద్రానికి ఎంపీల లేఖ

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 07 , 2025 | 09:02 PM