Supreme Court: రాష్ట్రపతికీ గడువు
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:58 AM
సుప్రీంకోర్టు గవర్నర్ల ద్వారా పంపిన బిల్లులపై రాష్ట్రపతికి మూడు నెలల గడువు నిర్ణయించింది. ఆలస్యం జరిగినట్లయితే, కారణాలు వివరించాలని చెప్పింది, గవర్నర్లకు మరియు రాష్ట్రపతికి సంపూర్ణ వీటో అధికారం లేదని స్పష్టం చేసింది

గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి: సుప్రీం కోర్టు
దేశచరిత్రలో తొలిసారి రాష్ట్రపతికి గడువు నిర్దేశించిన సర్వోన్నత న్యాయస్థానం
జాప్యమైతే కారణాలు రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలి
గవర్నర్లకే కాదు రాష్ట్రపతికి కూడా
సంపూర్ణ వీటో అధికారం ఎంతమాత్రం లేదు
బిల్లులో రాజ్యాంగ విరుద్ధ అంశాలున్నట్టు భావిస్తే
‘సుప్రీం’కు పంపి సలహా తీసుకోవాలి
శ్రీలంకలో ఇదే విధానం అమలులో ఉంది
గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే..
రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుల్ని ఆశ్రయించవచ్చు
రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న
బిల్లులపై ముందే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి
కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలిచ్చి,
సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలి
తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీం పూర్తి తీర్పు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: గవర్నర్లు పంపే బిల్లులపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సాక్షాత్తూ రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. అంతకుమించి ఆలస్యమైతే.. జాప్యానికి సహేతుక కారణాలను సైతం నమోదు చేసి, సంబంధిత రాష్ట్రాలకు ఆ విషయాన్ని తెలపాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఒకవేళ.. ఏదైనా బిల్లు రాజ్యాంగవిరుద్ధంగా ఉందని రాష్ట్రపతి భావిస్తే, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా దానిపై సుప్రీంకోర్టు సలహా తీసుకోవచ్చని సూచించింది. అలాగే.. గవర్నర్లు పంపే బిల్లులపై నిర్దేశిత గడువులోగా ప్రెసిడెంట్ ఏ చర్యా తీసుకోకపోతే, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులను ఆశ్రయించి, రాష్ట్రపతికి వ్యతిరేకంగా రిట్ ఆఫ్ మాండమస్ జారీ చేయాల్సిందిగా కోరుతూ రిట్‌పిటిషన్లు దాఖలు చేయొచ్చని పేర్కొంది. అదే సమయంలో.. గవర్నర్లు పంపే బిల్లులపై రాజ్యాంగంలోని 201వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి వ్యవహరించాలని.. రాష్ట్రాలు సైతం కేంద్రం అడిగే ప్రశ్నలకు వేగంగా సమాధానాలు ఇచ్చి సహకరించాలని, కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇలా రాష్ట్రపతికి ఒక అంశంలో నిర్ణయం తీసుకోవడానికి గడువును నిర్దేశిస్తూ తీర్పునివ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులపై గవర్నర్ రవి ఏ నిర్ణయమూ తీసుకోకుండా తొక్కిపెడుతున్నారంటూ తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి ఆ బిల్లులు ఆమోదం పొందినట్టుగా ఏప్రిల్ 8న తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికైన ప్రజాప్రభుత్వాలు పంపే బిల్లుల విషయంలో నిర్ణయానికి సంబంధించి.. నాడు గవర్నర్లకు గడువు విధించిన సుప్రీంకోర్టు రాష్ట్రపతికి సైతం గడువును నిర్దేశించడం విశేషం. ఈమేరకు 415 పేజీల తీర్పు కాపీని సుప్రీంకోర్టు శుక్రవారం రాత్రి 10.54 గంటలకు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
మినహాయింపు లేదు..
గవర్నర్‌కుగానీ, రాష్ట్రపతికిగానీ సంపూర్ణ వీటో అధికారాలు లేవని సుప్రీం తన తీర్పులో తేల్చిచెప్పింది. ‘‘ఏ బిల్లు విషయంలోనూ గవర్నర్‌కు సంపూర్ణ వీటో అధికారాలు ఉండవని మేం (తీర్పులోని ముందరి పేరాల్లో) పేర్కొన్నాం. అదే ప్రమాణాన్ని.. రాష్ట్రపతికి వర్తింపజేయకుండా ఉండడానికి మాకు ఏ కారణమూ కనపడట్లేదు.
రాజ్యాంగం అంతటా కనిపించే ఈ ప్రామాణిక సూత్రానికి రాష్ట్రపతి ఏమీ మినహాయింపు కాదు. అటువంటి అదుపులేని (హద్దుల్లేని) అధికారాలు ఈ రెండు రాజ్యాంగ పదవుల్లో ఏ ఒక్కదానికీ ఉండరాదు’’ అని తీర్పులో స్పష్టం చేసింది. ఏదైనా ఒక బిల్లు రాష్ట్ర జాబితాలోనిదై ఉండి.. ఆ బిల్లును రాష్ట్ర మంత్రివర్గ సలహాకు విరుద్ధంగా గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు, ఆ బిల్లును ఎక్కువకాలం పెండింగ్‌లో పెడితే.. న్యాయ సమీక్షలో భాగంగా కోర్టులు ఆ బిల్లు నిలుపుదలకు గల కారణాలను పరిశీలించవచ్చని సుప్రీం దర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ తగిన కారణాలు చెప్పకుండా పెండింగ్‌లో పెడితే.. రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వం నిజాయతీతో వ్యవహరించకపోయి ఉండొచ్చని భావించడానికి తాము సంకోచించబోమని స్పష్టం చేసింది. రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్న బిల్లులు, రాష్ట్రపతి ఆమోదం అవసరమయ్యే బిల్లుల విషయంలో.. వాటిని శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించాలని రాష్ట్రప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించింది. అలా రాష్ట్రప్రభుత్వాల నుంచి వచ్చే శాసనపరమైన ప్రతిపాదనలను వీలైనంత వేగంగా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. తద్వారా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల్లో ఘర్షణ వాతావరణం తగ్గుతుందని.. భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న అడ్డంకులను ముందే నిరోధించవచ్చని పేర్కొంది.
సమయం, వనరుల ఆదా..
‘‘కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల చర్యల రాజ్యాంగబద్ధత, చట్టబద్ధతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తినప్పుడు న్యాయనిర్ణయం చేసే బాధ్యత రాజ్యాంగ కోర్టులకు ఉంది. కాబట్టి.. ఏదైనా బిల్లు స్పష్టంగా రాజ్యాంగవిరుద్ధంగా ఉందని భావించి, గవర్నర్ దానికి రాష్ట్రపతి పరిశీలనకు పంపితే.. రాష్ట్రపతి ఆ బిల్లును 143వ అధికరణ కింద (తప్పనిసరి కాకపోయినప్పటికీ), దూరదృష్టితో ముందుజాగ్రత్తచర్యగా సుప్రీంకోర్టుకు పంపాలి’’ అని ధర్మాసనం తన తీర్పులో వివరించింది. సలహాలు, అభిప్రాయాల నిమిత్తం బిల్లులను రాజ్యాంగ కోర్టులకు సిఫారసు చేసే ఏర్పాటు ఏదీ రాష్ట్రాల స్థాయిలో గవర్నర్లకు లేనందున.. ఆ బాధ్యత రాష్ట్రపతిపైనే ఉందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దీవాలా.. మన పొరుగు ఉన్న ద్వీపదేశమైన శ్రీలంకలో ఉన్న సంప్రదాయం గురించి వివరించారు. ‘‘(శ్రీలంకలో) ప్రాంతీయ మండళ్లు చేసే చట్టాలు రాజ్యాంగవిరుద్ధంగా ఉన్నాయని అక్కడి గవర్నర్ భావిస్తే వారు ఆ బిల్లును ప్రెసిడెంట్‌కు సిఫారసు చేస్తారు. ప్రెసిడెంట్ ఆ బిల్లు రాజ్యాంగబద్ధతను పరిశీలించడానికి శ్రీలంక సుప్రీంకోర్టుకు పంపుతారు. సుప్రీంకోర్టు ఆ బిల్లు రాజ్యాంగబద్ధమేనని ప్రకటిస్తే.. గవర్నర్ దానికి బద్ధుడై ఆమోదం తెలపాల్సి ఉంటుంది’’ అని వివరించారు. లోపాలతో కూడిన బిల్లులు చట్టాలుగా మారితే కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలవుతాయని.. అవి అమల్లోకి రావడం ఆలస్యమవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలా కాకుండా.. బిల్లుల రాజ్యాంగబద్ధతకు సంబంధించి రాజ్యాంగ కోర్టుల సలహాలు, అభిప్రాయాలు ముందే తీసుకోవడం వల్ల సమయం, ప్రభుత్వ వనరులు.. రెండూ ఆదా అవుతాయని వివరించింది. దానికితోడు శాసనవ్యవస్థకు తమ బిల్లులను పరిశీలించుకుని, తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి మరో అవకాశం దొరుకుతుందని పేర్కొంది. ఏది ఏమైనా.. బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపడం అనే ప్రక్రియ రాష్ట్రాలకున్న శాసనాధికారాలకు విఘాతం కలిగించేదిగా ఉండకూడదని తేల్చిచెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..