Darshan High Profile Case Bail: ఇదేం తీర్పు
ABN , Publish Date - Jul 25 , 2025 | 03:25 AM
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, ఇతర నిందితులకు బెయిల్ మంజూరుచేసిన హైకోర్టుపై..

వివేకాన్ని ఉపయోగించారా?
న్యాయ విచక్షణాధికారాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేశారు
కుట్ర, హత్యకు సంబంధించిన కేసును హైకోర్టు జడ్జి చూడాల్సింది ఇలాగేనా?
నటుడు దర్శన్‌కు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
బెంగళూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, ఇతర నిందితులకు బెయిల్ మంజూరుచేసిన హైకోర్టుపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. ‘వివేకాన్ని వాడే హైకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చిందా.?’ అని ఘాటుగా ప్రశ్నించింది. న్యాయ విచక్షణాధికారం తీవ్రంగా దుర్వినియోగం అయిందని వ్యాఖ్యానించింది. బెయిల్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. ‘ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వవచ్చా? హైకోర్టు చేసిన తప్పునే మేం కూడా చేయదలుచుకోలేదు. బెయిల్ తీర్పును ఇచ్చేముందు విచక్షణాధికారాన్ని కోర్టు ఉపయోగించిందో లేదో పరిశీలించాలని అనుకుంటున్నాం. అందువల్ల పిటిషన్‌పై తొందరపడి తీర్పు ఇవ్వడంగానీ, విడుదలకు లేక శిక్షలకు ఆదేశాలు ఇవ్వడంగానీ చేయబోం’’ అని న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా.. దర్శన్, ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చిన తీరును బెంచ్ తప్పుబట్టింది. ‘‘ప్రతి బెయిల్ తీర్పును హైకోర్టు ఇలాగే రాస్తుందా? ఈ కేసును హైకోర్టు చూసిన దృష్టి ఎక్కువగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. సెషన్స్ కోర్టు జడ్జి అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ, హైకోర్టు న్యాయమూర్తి ఇలాంటి పొరపాటు చేయడమేంటి? ఇంతేనా జడ్జి అవగాహన?. ఇది కుట్ర, హత్యలకు సంబంధించిన కేసు కావడంతో మా స్వరం కొంచెం కటువుగానే ఉంటుంది.’’ అని బెంచ్ తెలిపింది. రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్, నటి పవిత్రాగౌడ, ఇతర నిందితులకు గత ఏడాది డిసెంబరు 13న కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆరఽశయించింది. విచారణ సందర్భంగా ఈ కేసులో పవిత్ర పాత్రపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ‘‘అంతా మీవల్లే జరిగింది. మీరు అక్కడ లేకపోతే ఏ2 పట్టించుకునేవారుకాదు. ఏ2 స్పందించకపోతే మిగతావారూ పట్టించుకునేవారు కాదు. మొత్తం సమస్యకు మీరే కారణం.’’ అంటూ ఆగ్రహించింది. దీనిపై పవిత్ర తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ‘‘ఆమెకు (రేణుకాస్వామి నుంచి) అభ్యంతరకర మెజే్‌సలు వచ్చేవి. నేరుగా మాట్లాడిన కాల్ రికార్డులు లేవు. అపహరణ, హత్యతో ఆమెకు సంబంధం ఉన్నట్టు ఆధారాలు లేవు’’ అని వాదించారు. అయితే, తాము వాదనల లోతుల్లోకి వెళ్లదలుచుకోలేదని బెంచ్ స్పష్టం చేసింది.
గార్డులు కిరణ్, పునీత్‌ల వాంగ్మూలాలను హైకోర్టు ఎందుకు తిరస్కరించిందని బెంచ్ నిలదీసింది. కర్ణాటక ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. కాల్ డేటా రికార్డులు, లొకేషన్ పిన్‌లు, దుస్తులపై, వాహనంలో దొరికిన డీఎన్‌ఏ, ఇతర ఆధారాలు వారిద్దరి వాంగ్మూలాలను ధ్రువీకరించాయని వాదించారు. సాక్ష్యాధారాల తీరుపై బెంచ్ పలు ప్రశ్నలు సంధించింది. ‘‘నిందితుల నుంచి మీరు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. దాడి దృశ్యాలను దానిలో ఎలా బంధించారు?.’’ అని ప్రశ్నించింది. దీనికి లూథ్రా బదులిస్తూ.. దాడి ఫొటోలు ఏ2కు ఫార్వర్డ్ అయ్యాయని, తనను కొట్టవద్దు అని హతుడు వేడుకొంటుండగా తీసిన ఫొటో కూడా అందులో ఉన్నదని తెలపగా, బెంచ్ విస్మయానికి గురయింది. ‘‘ఒకవైపు కొడుతున్నారు.. మరోవైపు ఫొటోకు పోజు ఇస్తున్నారు.. నిజంగా నమ్మలేకపోతున్నాం.’’ అని వ్యాఖ్యానించింది. వారు తమ అభిమాన నటుడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉండే దర్శన్ అభిమాన సంఘానికి చెందినవారని లూథ్రా వివరించారు. ‘‘ఇదో కిరాతక హత్య. సోషల్ మీడియాలో పోస్టు చేశారనే కారణంగా రేణుకాస్వామిని కిడ్నాప్ చేసి కిరాతకంగా హతమార్చారు. నిందితులు దర్శన్, పవిత్రగౌడ సహా అందరి కండిషన్ బెయిల్‌ను రద్దు చేయాలి’’ అని ఆయన కోరారు. కాగా, దర్శన్ తరఫు న్యాయవాది కపిల్‌సిబల్ మరో కేసును వాదించేందుకు వెళ్లడంతో లిఖితపూర్వక వాదనల కోసం వారంరోజుల గడువు ఇస్తున్నామని బెంచ్ తెలిపింది. దీంతో బెయిల్ రద్దు కావచ్చునని నిందితులలో భయం పట్టుకుంది. నిందితులకు వ్యతిరేకంగానే తీర్పు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ‘డెవిల్’ సినిమా షూటింగ్ కోసం నటుడు దర్శన్ థాయ్‌లాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే.