SIR: ఆధార్ ఉంటే, ఓటు హక్కు ఇచ్చెయ్యాలా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 27 , 2025 | 01:10 PM
ఆధార్ కార్డును ఓటు వేసేందుకు ఒక హక్కుగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితాలను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ల మీద అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల సంఘం తెచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓటర్ల జాబితాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆధార్ ఉన్న విదేశీయులను ఓటు వేయడానికి అనుమతించవచ్చా..? అంటూ సుప్రీంకోర్టు పిటిషనర్లను ఎదురు ప్రశ్నించింది. ఆధార్ కార్డు.. దేశ పౌరసత్వానికి సంపూర్ణ రుజువు కాదని పేర్కొంది. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో 'సర్' కసరత్తుపై ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తుది విచారణను సుప్పీంకోర్టు బుధవారం చేపట్టిన సంగతి తెలిసిందే.
ఆధార్‌ను పౌరసత్వానికి తిరుగులేని రుజువుగా పరిగణించలేమని ఈ సందర్బంగా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఉపయోగించే దరఖాస్తులో ఫారమ్ 6లోని ఎంట్రీల కచ్చితత్వాన్ని నిర్ణయించే అధికారాన్ని పోల్ ప్యానెల్ కలిగి ఉందని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.
ఆధార్ ఉద్దేశ్యం పరిమితమని న్యాయమూర్తులు ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. 'ఆధార్ అనేది ప్రయోజనాలను పొందడానికి చట్టం చేసిన సృష్టి. ఒక వ్యక్తికి రేషన్ కోసం ఆధార్ మంజూరు చేస్తే, అతన్ని కూడా ఓటరుగా చేయాలా? ఎవరైనా పొరుగు దేశానికి చెందినవారు, లేదా దేశంలో కార్మికుడిగా పనిచేస్తే, అతన్ని ఓటు వేయడానికి అనుమతిస్తారా? అంటూ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.
పోల్ బాడీ.. పోస్ట్ ఆఫీస్ లాగా పనిచేయాలా అని ప్రశ్నించిన సుప్రీంకోర్టు.. ప్రతి ఫారమ్ 6 సమర్పణను అంగీకరించాలన్న పిటిషనర్ల వాదనను తిరస్కరించింది. 'ఎన్నికల కమిషన్ ఒక పోస్టల్ ఆఫీస్ అని, అది.. మీరు సమర్పించిన ఫారమ్ 6 ను అంగీకరించి, ఓటర్ల జాబితాలో మీ పేరును చేర్చాలని మీరు చెబుతున్నారు' అంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
కొంతమంది పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, SIR ప్రక్రియ సాధారణ ఓటర్లపై రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతుందని వాదించారు. ప్రతిగా సుప్రీంకోర్టు.. ఇంతకు ముందు ఎప్పుడూ ఎస్ఐఆర్ లేదుకదా, ఇప్పుడు నిర్వహించడం సరికాదనడం కరెక్ట్ కాదని కూడా తేల్చి చెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News