Haridwar: హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట
ABN , Publish Date - Jul 28 , 2025 | 04:58 AM
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. 28 మంది గాయాలపాలయ్యారు.

ఆరుగురి మృతి.. 28 మందికి గాయాలు
విద్యుత్తు వైరు తెగిపడిందన్న వదంతులతోనే..
విచారణకు ఆదేశించిన ఉత్తరాఖండ్ సర్కారు
మృతులకు రూ.2 లక్షల పరిహారం: సీఎం ధామి
తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,
ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం
హరిద్వార్, జూలై 27: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడగా.. 28 మంది గాయాలపాలయ్యారు. కొండపైన ఉన్న మానసాదేవి అమ్మవారి దర్శనం కోసం ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అదేసమయంలో విద్యుత్ వైరు తెగి పడిందన్న వదంతులు వ్యాపించడంతో భక్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. 500 అడుగులకు పైగా ఎత్తయిన కొండపైకి వెళ్లే మెట్ల మార్గంలో విద్యుత్తు వైరు తెగి పడిందన్న ఊహాగానాలతో ఉదయం 9 గంటల సమయంలో ఒక్కసారిగా భక్తులు పరుగులు తీశారు. మెట్లపై పెద్ద సంఖ్యలో భక్తులు ఉండడంతో తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో 34 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించినట్లు హరిద్వార్ సీనియర్ ఎస్పీ ప్రేమేంద్ర సింగ్ తెలిపారు. వారిలో ఆరుగురు మరణించారన్నారు.
మృతులను ఆరుష్ (12), శకల్‌దేవ్ (18), విక్కీ (18), విపిన్ (18), వకీల్, శాంతిగా గుర్తించినట్లు చెప్పారు. 28 మంది చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.