Share News

Delhi Blast: శ్రీనగర్‌లో మరో అనుమానితుడి అరెస్టు

ABN , Publish Date - Nov 22 , 2025 | 08:05 PM

గత అక్టోబర్‌లో నౌగామ్‌లోని బన్‌పోరలో పోలీసులు, భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ పోస్టర్లు వెలిసాయి. దీనిపై శ్రీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చింది.

 Delhi Blast: శ్రీనగర్‌లో మరో అనుమానితుడి అరెస్టు
Delhi Blast

శ్రీనగర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుడు ఘటనలో దర్యాప్తు బృందాల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. జైషే ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కేసుకు సంబంధించి శ్రీనగర్ నివాసి ఒకరిని జమ్మూకశ్మీర్ పోలీస్ స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) శనివారంనాడు అరెస్టు చేసింది. బతమలూ ఏరియాకు చెందిన ఇతనిని తుఫైల్ నియాజ్ భట్‌గా గుర్తించారు.


గత అక్టోబర్‌లో నౌగామ్‌లోని బన్‌పోరలో పోలీసులు, భద్రతా సిబ్బందిని బెదిరిస్తూ పోస్టర్లు వెలిసాయి. దీనిపై శ్రీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించడంతో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ వెలుగు చూసింది. శ్రీనగర్ సీనియర్ ఎస్పీ డాక్టర్ జీవీ సుందీప్ చక్రవర్తి ఈ విచారణను పర్యవేక్షించి, సీసీటీవీ అనాలసిస్ చేపట్టడంతో మొదటి ముగ్గురి అనుమానితులు పట్టుబడ్డారు. ఆరిఫ్ నసీర్ దర్ అలియాస్ సాహిల్, యాసిర్ ఉల్ అష్రాఫ్, మక్సూద్ అహ్మద్ దర్ అలియా షాహిద్‌లను అరెస్టు చేశారు. వీరిని విచారించిన దర్యాప్తు సంస్థలు ఇర్ఫాన్ అమ్మద్ అనే మరో వ్యక్తిని పట్టుకున్నారు. అతను గతంలో పారామెడిక్‌గా పనిచేసి ఇమామ్‌గా మారాడని, పోస్టర్లు సరఫరా చేయడంతో పాటు డాక్టర్లను రాడికల్స్‌గా మార్చినట్టు గుర్తించారు.


ఆ క్రమంలోనే ఫరీదాబాద్‌లోని అల్ ఫయిదా యూనివర్శిటీలో సోదాలు నిర్వహించారు. డాక్టర్ ముజఫర్ గనాయే, డాక్టర్ షహీన్ సయీద్‌లను అరెస్టు చేసి 2,900 కిలోల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ గనాయ్, కారు పేలుడులో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబి, ముజఫర్ రాథెర్‌లతో కూడిన కోర్ గ్రూప్ ఈ పేలుడు కుట్రకు ప్రధాన కారణమని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ముజఫర్ రాథెర్ పరారీలో ఉన్నాడు.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీ పేలుడుకు డబ్బులు సమకూర్చిన డాక్టర్లు.. సంచలన విషయాలు వెలుగులోకి

హిందువులు ఉనికి కోల్పోతే ప్రపంచానికే ఉనికి ఉండదు.. మోహన్ భాగవత్

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 22 , 2025 | 08:07 PM