Sonia Gandhi: ఆస్తే లేనప్పుడు మనీలాండరింగ్ ఎక్కడిది?
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:21 AM
నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పులు తీర్చే క్రమంలో నగదు అక్రమ చలామణికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై ఈడీ నమోదు చేసిన కేసుపై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా న్యాయవాది వాదనలు
న్యూఢిల్లీ, జూలై 4: నేషనల్ హెరాల్డ్ పత్రిక అప్పులు తీర్చే క్రమంలో నగదు అక్రమ చలామణికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై ఈడీ నమోదు చేసిన కేసుపై శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసును పరిగణనలోకి తీసుకోవాలంటూ ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు చేసిన వాదనను సోనియా తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఖండించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహించే ఏజేఎల్‌కు ఉన్న రూ.90 కోట్ల అప్పులను యంగ్ ఇండియన్ అనే సంస్థ తీర్చిందని, ఇందుకు ప్రతిగా రూ.2వేల కోట్లు విలువ చేసే ఏజేఎల్ ఆస్తులను ఆ సంస్థకు బదలాయించారని ఈడీ ఆరోపించింది.
యంగ్ ఇండియన్ సంస్థలో 76ు వాటాలు సోనియా, రాహుల్ గాంధీలకు ఉన్నందున అంతిమ లబ్ధిదారులు వారేనని ఆరోపిస్తూ ఈడీ వారిపై మనీలాండరింగ్ కేసు పెట్టింది. అయితే, ఎలాంటి ఆస్తులు చేతులు మారకుండానే నగదు అక్రమ చలామణి జరిగినట్టు కేసు నమోదు చేయడం విచిత్రమని సింఘ్వి వాదించారు. ఒకే పరిధిలో ఉన్న ఒక సంస్థ అప్పులను మరో సంస్థ తీర్చడం, అందుకు వివిధ మార్గాల్లో ఆస్తులు బదలాయించడం అన్ని కంపెనీలు చేస్తున్న పనేనని చెప్పారు. ఇందుకు చట్టం కూడా అనుమతి ఇస్తుందని తెలిపారు.