Kamal Kaur: ఇన్‌ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ హత్యలో గగుర్పొడిచే నిజాలు
ABN , Publish Date - Jun 16 , 2025 | 08:29 PM
మోడల్ శీతల్ హత్యోదంతం హర్యానాలో సంచలనంగా మారితే, అటు పక్క రాష్ట్రం పంజాబ్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్(30) హత్యాకాండ జనాల ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: మోడల్ శీతల్ హత్యోదంతం హర్యానాలో సంచలనంగా మారితే, అటు పక్క రాష్ట్రం పంజాబ్‌లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్(30) హత్యాకాండ జనాల ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. గత వారం సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ అయిన కమల్ కౌర్ అనే మహిళను కూడా దుండగులు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. పంజాబ్‌లోని బతిండా-చండీగఢ్ జాతీయ రహదారిపై ఉన్న ఆదేశ్ మెడికల్ యూనివర్సిటీ పార్కింగ్ స్థలంలో కారులో కమల్ కౌర్ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. లూథియానా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేటుతో ఉన్న కారు వెనుక సీటులో కౌర్ మృతదేహం పడి ఉంది.
కారు నుండి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో పోలీసులు డెడ్ బాడీని కనుగొన్న సందర్భంలో కౌర్ మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉంది.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం, శ్రీమతి కౌర్ జూన్ 9న ఇంటి నుండి బయలుదేరి, ఒక ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరు కావడానికి బతిండాకు వెళ్తున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. అప్పటి నుండి ఆమె కనిపించకుండా పోయి, చివరికి శవమై కారులో కుళ్లిపోయిన స్థితిలో కనిపించారు.
కాంచన కుమారిగా పేరొందిన కమల్ కౌర్.. చిన్నా చితకా బోల్డ్ కంటెంట్‌తో పాటు కొన్ని ఫన్నీ వీడియోస్‌తో నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు. కొన్ని పోస్టుల విషయంలో వివాదాలు, విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. అయితే, ఈ చిన్నపాటి పోస్టులే ఆమె హత్యకి కారణంగా మారాయి.
కాంచన కుమారిని అమృతపాల్ సింగ్ గ్యాంగ్ హత్య చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో బోల్డ్ కంటెంట్ పోస్ట్ చేస్తుందని.. అందుకే చంపేసి శిక్ష విధించినట్లు అమృతపాల్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. పంజాబ్‌లో ఇలాంటి వాటికి ఆస్కారం లేదని.. మిగతా వారికీ ఇలాంటి గతే పడుతుందంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ హత్యకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు అమృత్ పాల్ సింగ్ మెహ్రాన్ పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలింపు చేపట్టినట్లు ఎస్పీ అమ్‌నీత్ కొండల్ వెల్లడించారు. కాంచన్ కుమారిని నిందితులు గొంతు నులిమి చంపారని.. విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ దాడుల వేళ అక్కడి భారతీయులకు కీలక సూచన
36 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. యోచనలో అమెరికా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి