Heart Attacks: కొవిడ్ సైడ్ ఎఫెక్ట్‌తో గుండెపోటు మరణాలు.. సీఎం సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 01 , 2025 | 08:37 PM
రాష్ట్రంలో యువకులు అకస్మాత్తుగా మరణించడం వెనుక కారణాలపై గత ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన కమిటీకే ఈ బాధ్యత అప్పగించామని, కొవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయా? అనే దానిపైనా కమిటీ అధ్యయనం చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు.

బెంగళూరు: కర్ణాటక హసన్ జిల్లాలో గుండెపోటుతో మృతిచెందుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఎట్టకేలకు అంగీకరించారు. ఒకే జిల్లాలో 20 మందికి పైగా మరణించడం ఆందోళన కలిస్తోందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. ఈ మరణాలకు కొవిడ్ వ్యాక్సిన్‌ను హడావిడిగా ఆమోదించడం, ప్రజలకు పంపిణీ చేయడం కూడా కారణం కావచ్చని వ్యాఖ్యానించారు.
'గత ఒక్క నెలలోనే హసన్ జిల్లాలో 20 మందికి పైగా గుండెపోటుతో మరణించారు. ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. వరుస మరణాల వెనుక కారణాన్ని కనిపెట్టి, పరిష్కారం చెప్పేందుకు జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్క్యులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాథ్ సారథ్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కోరాం' అని సిద్ధరామయ్య ఆ ట్వీట్‌లో తెలిపారు. రాష్ట్రంలో యువకులు అకస్మాత్తుగా మరణించడం వెనుక కారణాలపై గత ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన కమిటీకే ఈ బాధ్యత అప్పగించామని, కొవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రతికూల పరిణామాలు ఎదురయ్యాయా? అనే దానిపైనా కమిటీ అధ్యయనం చేస్తుందన్నారు. గుండెపోటు మరణాలు పెరగడానికి కొవిడ్ వ్యాక్సిన్ కారణం కావచ్చని ప్రపంచ వ్యాప్తంగా పలు అధ్యయనాలు ఇటీవల వెల్లడించాయని చెప్పారు. ఈ విషయంలో విమర్శలు చేసే ముందు బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని విమర్శించారు.
హసన్ జిల్లాలో అకస్మాత్తుగా గుండెపోటు మరణాలు చోటుచేసుకోవడానికి అసలు కారణానికి కనిపెట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని సీఎం చెప్పారు. ఈ లక్ష్యంతోనే ప్రజారోగ్య పరిరక్షణ కోసం 'హృదయ జ్యోతి', 'గృహ ఆరోగ్య' వంటి పథకాలను ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు. డాక్టర్ రవీంద్రనాథ్ నాయకత్వంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
సిద్ధరామయ్య సర్కార్‌కు ఎదురుదెబ్బ.. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం
వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్‌కు ఏఆర్ రెహమాన్ ప్రత్యేక గీతం.. సాయి సంఫనీ ఆర్కెస్ట్రాపై ప్రశంసలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి