Share News

Kannada Row: అందుకు చప్పట్లు కొట్టలేదు.. కమల్ వ్యాఖ్యలపై శివ రాజ్‌కుమార్

ABN , Publish Date - Jun 01 , 2025 | 08:04 PM

కమల్‌హాసన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ శివ రాజ్‌కుమార్ చెప్పారు. అన్ని భాషలూ మనకు ముఖ్యమేనని, అయితే మాతృభాష విషయానికి వచ్చేసరికి కన్నడానికే తమ మొదట ప్రాధాన్యత అని అన్నారు.

Kannada Row: అందుకు చప్పట్లు కొట్టలేదు.. కమల్ వ్యాఖ్యలపై శివ రాజ్‌కుమార్

బెంగళూరు: 'థగ్ లైఫ్' చిత్రం ప్రమోషనల్ ఈవెంట్‌లో నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan) చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణుగలేదు. తమిళం నుంచే కన్నడం పుట్టిందంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడనాట వివాదం రేపాయి. కమల్ క్షమాపణ చెప్పేంత వరకూ కర్ణాటకలో ఆయన సినిమా విడుదల కానీయమంటూ కన్నడ సంస్థలు హెచ్చరించాయి. కాగా, ఈ చిత్రం ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar తాజాగా ఈ వివాదంపై స్పందించారు. కమల్ కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు తాను క్లాప్స్ కొట్టానంటూ కొందరు అపోహ పడుతుండటంపై వివరణ ఇచ్చారు.


ఏకీభవించను.. ఆ మాట అడగను

కమల్‌హాసన్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదని ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ శివ రాజ్‌కుమార్ చెప్పారు. అన్ని భాషలూ మనకు ముఖ్యమేనని, అయితే మాతృభాష విషయానికి వచ్చేసరికి కన్నడానికే తమ మొదట ప్రాధాన్యత అని, అందులో సందేహమే లేదని చెప్పారు. ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా తాను చెప్పానని, కన్నడానికే తన జీవితం అంకితమని ఆయన తెలిపారు. క్షమాపణ చెప్పమని కమల్‌ను అడుగుతారా అని ప్రశ్నించినప్పుడు, ఆ మాట తాను అడగలేనని, ఆయన సీనియర్ నటుడని, ఆయనకు తాను పెద్ద అభిమానినని సమాధానమిచ్చారు.


కమల్ వ్యాఖ్యలు చేసినప్పుడు తాను క్లాప్స్ కొట్టానంటూ కొందరు తప్పుగా అర్ధం చేసుకోవడంపై శివ రాజ్‌కుమార్ వివరణ ఇస్తూ, క్లాప్స్ కొట్టిన మాట నిజమే అయినా సందర్భం మాత్రం అది కాదని చెప్పారు. కమల్ వ్యాఖ్యలు చేసినప్పుడు తాను క్లాప్స్ కొట్టినట్టు చూపించారని, అయితే ఆయన మా అంకుల్ అంటూ కమల్ చెప్పినప్పుడు తాను క్లాప్స్ కొట్టానని వివరించారు.


కమల్ ససేమిరా..

తమిళం నుంచే కన్నడం పుట్టిందంటూ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పేందుకు కమల్ నిరాకరించారు. ఇది ప్రజాస్వామ్యమనీ, చట్టం, న్యాయంపై తనకు నమ్మకం ఉందని అన్నారు. కర్ణాటక, ఆధ్రప్రదేశ్, కేరళ అంటే తనకు చాలా ఇష్టమని, ఏదో ఎజెండా పెట్టుకున్న వారు తప్ప ఎవరూ తన మాటలను సందేహించరని అన్నారు. గతంలో కూడా తనను బెదిరించారని చెప్పారు. తాను తప్పుచేస్తే క్షమాపణ చెబుతానని, తప్పుచేయనపుడు క్షమాపణ చెప్పేది లేదని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

దేవుడు కంటే మీరే ఎక్కువ.. లూలూ, రబ్రీకి తేజ్ ప్రతాప్ ఎమోషనల్ పోస్ట్

అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్.. పోటీ ఎక్కడినుంచంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 01 , 2025 | 08:07 PM