Scindia On Sanchar Saathi: ఇకపై ఫోన్లో ఆ యాప్ తప్పనిసరేం కాదు..
ABN , Publish Date - Dec 02 , 2025 | 02:56 PM
దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్ఫోన్లో తప్పనిసరిగా సంచార్ సాథీ యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: ఇకనుంచి దేశంలో విక్రయించే అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో 'సంచార్ సాథీ' (Sanchar Saathi) యాప్‌ను ప్రీ-ఇన్స్టాల్ (డిఫాల్ట్‌గా) చేయాలంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై మంగళవారంనాడు పార్లమెంటు దద్దరిల్లింది. ఇది వ్యక్తిగత గోప్యతకు భంగమని, దీనిపై విస్తృత చర్చ జరపాలంటూ విపక్ష కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో 'సంచార్ సాథీ' యాప్‌పై కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) వివరణ ఇచ్చారు. వినియోగదారులు అక్కర్లేదనుకుంటే తమ స్మార్ట్ ఫోన్ల నుంచి యాప్‌ను డిలీట్ చేయవచ్చని చెప్పారు. ఇది ఐచ్ఛికమని అన్నారు. ప్రతి ఒక్కరి కోసం ఈ యాప్‌ను ప్రవేశపెట్టడం తన డ్యూటీ అని, డివైస్‌లో యాప్ ఉంచుకోవాలా వద్దా అనేది వినియోగదారుని ఇష్టమని తెలిపారు.
దేశంలో ఇక నుంచి విక్రయించే ప్రతి సెల్ఫోన్లో తప్పనిసరిగా 'సంచార్ సాథీ' యాప్ ముందుగానే ఇన్స్టాల్ చేయాలని ఫోన్ దిగుమతిదార్లు, తయారీదార్లను టెలికాం శాఖ ఆదేశించింది. 90 రోజుల్లోపు ఈ నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇప్పటికే విక్రయించిన ఫోన్లలో సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా యాప్‌ను ఇన్స్టాల్ చేయాలని పేర్కొంది. ఈ దిశగా తీసుకున్న చర్యలకు సంబంధించిన కంప్లయెన్స్ నివేదికను 120 రోజుల్లోగా సమర్పించాలని తెలిపింది. ఈ యాప్ ఫోన్ యూజర్లకు స్పష్టంగా కనిపించేలా ఇన్స్టాల్ చేయాలని, మొదటిసారి డివైజ్ సెటప్ సమయంలోనే ఇది యూజర్లకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం యాపిల్, సామ్సంగ్, గూగుల్, వివో, ఒప్పో, షియోమీ వంటి ప్రధాన కంపెనీలు ఇండియాలో హ్యాండ్సెట్లు తయారు చేస్తున్నారు. వీటికి తాజా ఆదేశాలు వర్తిస్తాయి.
'సంచార్ సాథీ' అంశంపై పార్లమెంటులో మంగళవారం తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ చర్య ప్రజల ప్రైవసీ ఉల్లంఘనేనంటూ కాంగ్రెస్, శివసేన, యూటీబీ, టీఎంసీ తప్పుపట్టాయి. విస్తృత చర్చ జరగాలని పార్టీలు డిమాండ్ చేశాయి. కాగా, దీనిపీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికామ్ (డీఓటీ) స్పందించింది. ఈ యాప్ కేవలం సైబర్ సెక్యూరిటీకి ఉద్దేశించినది మాత్రమేనని, ఇందులో ప్రైవసీ ఉల్లంఘన లేదని, యూజర్ డాటాను రక్షిస్తుందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
పార్లమెంట్లో 'సంచార్ సాథీ' రగడ.. దేశ ప్రజల గోప్యతపై దాడి అంటూ విపక్షాల నిరసన
సెల్‌ఫోన్స్‌లో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి.. ఫోన్ తయారీదార్లకు కేంద్రం ఆదేశాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి