Air India Crash: విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేం
ABN , Publish Date - Jun 29 , 2025 | 05:25 PM
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డాటా రికార్డర్‌తో ఉన్న బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి మురళీధర్ మోహోల్ ధ్రువీకరించారు. అది ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అధీనంలో ఉందని తెలిపారు.

న్యూఢిల్లీ: అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం జూన్ 12న కుప్పకూలిన దుర్ఘటన వెనుక కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేమని, ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ (Muralidhar Mohol) తెలిపారు. బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 విమానం (AI171) కుప్పకూలిన ఘటనలో విమానంలోని 242 మందిలో ఒక్కరు మాత్రమే బయట పడగా, 29 మంది సివిలియన్స్‌తో కలిపి కలిపి మొత్తం 270 మంది ప్రాణాలు కోల్పోయారు.
''విమాన ప్రమాద ఘటనపై ఏఏబీ పూర్తి విచారణ చేపట్టింది. ప్రమాదం వెనుక కుట్ర కోణంతో సహా అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతోంది. సీసీటీవీ ఫుటేజ్‌ను సమీక్షిస్తున్నారు. దీనిపై పలు ఏజెన్సీలు పనిచేస్తున్నాయి' అని కేంద్ర మంత్రి తెలిపారు.
3 నెలల్లో క్రాష్ రిపోర్ట్
కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), ఫ్లైట్ డాటా రికార్డర్ (ఎఫ్‌డీఆర్)తో ఉన్న బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు మంత్రి ధ్రువీకరించారు. అది ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) అధీనంలో ఉందని తెలిపారు. డివైస్ (బ్లాక్ బాక్స్)ను విశ్లేషించేందుకు విదేశాలకు పంపవచ్చంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ఆ అవసరం లేదని, మొత్తం విచారణ ఇక్కడే జరుగుతుందని వివరించారు.
విమాన ప్రమాదం డబుల్ ఇంజెన్ వైఫల్యం వల్ల జరిగిందా, ఇంధనం సమస్య కారణమా, సాంకేతిక లోపం వల్ల తలెత్తిందా అనే దానిపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. రెండు ఇంజెన్లు మూసుకుపోవడం ఎప్పుడూ జరగలేదని, కాక్‌పిట్ సంభాషణలను సీవీఆర్ వెల్లడిస్తుందని, అయితే దీనిపై ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేమని మంత్రి వివరించారు. మూడు నెలల్లో పూర్తి నివేదిక వస్తుందని తెలిపారు.
భద్రతకు పూచీ
విమాన ప్రమాదానంతరం ప్రజల్లో తలెత్తిన భయాలపై మంత్రి మాట్లాడుతూ, డీజీసీఏ ఆదేశాలపై మొత్తం 33 డ్రీమ్‌లైనర్ల తనిఖీలు చేపట్టామని, సేఫ్టీకి ఎలాంటి ఢోకా లేదని మంత్రి భరోసా ఇచ్చారు. ఏవియేషన్ అంశాలపై మాట్లాడుతూ, డీజీసీఏలో 419 టెక్నికల్ వేకెన్సీలు ఉన్నాయని, త్వరలోనే దీనిని పరిష్కరిస్తామని చెప్పారు. ఏ ప్రైవేటు ఎయిర్‌లైన్ కూడా అనధీకృత నియామకాలు చేయలేదని, పైలెట్లు ఎవరైనా ఇబ్బందులకు గురైనట్లయితే తమ శాఖను సంప్రదించవచ్చని చెప్పారు. విమానాశ్రయంలో ఆహారం ధరలు ఎక్కువగా ఉండటంపై మాట్లాడుతూ, ఐదారు ప్రాంతాల్లో తక్కువ ధరలతో 'ఉడాన్ యాత్రి కేఫ్స్' ఇప్పటికే నడుసున్నాయని, నీళ్లు రూ.10, టీ, సమెసా రూ.20కు లభిస్తున్నాయని, వీటిని క్రమంగా విస్తరిస్తామని మురళీధర్ మోహోల్ తెలిపారు.
స్త్రీ ద్వేషం వ్యాఖ్యలపై మళ్లీ టీఎంసీ ఎంపీల మధ్య వార్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి