Dr. M.R. Raju: శాస్త్రవేత్త ఎంఆర్ రాజు అస్తమయం
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:28 AM
న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్టు (ఎంజీఎం) వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ముదుండి రామకృష్ణంరాజు (95) ఇకలేరు.

ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి
కాళ్ల, జూన్ 24(ఆంధ్రజ్యోతి): న్యూక్లియర్ ఫిజిక్స్ శాస్త్రవేత్త, గాంధేయవాది, మహాత్మాగాంధీ మెమోరియల్ ట్రస్టు (ఎంజీఎం) వ్యవస్థాపకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ముదుండి రామకృష్ణంరాజు (95) ఇకలేరు. ఎంఆర్ రాజుగా సుపరిచితమైన ఆయన మంగళవారం తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలోని ఎంజీఎం ట్రస్ట్ భవనంలో తుదిశ్వాస విడిచారు. ఎంఆర్ రాజు 1931లో పెద అమిరంలో జన్మించారు. శాస్త్రవేత్తగా, సామాజిక వేత్తగా ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. ఆయన మృతి వార్తను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో దహన సంస్కారాలు చేయాలని ఆదేశాలు జారీచేసింది. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆయన పార్థివ దేహంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.