Prashant Kishor: ఓటమికి బాధ్యత నాదే, పొరపాట్లు సరిచేసుకుంటాం
ABN , Publish Date - Nov 18 , 2025 | 02:57 PM
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం ప్రజల కోసం రూ.40,000 కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించడం ఇదే మొదటిసారని, ఆ కారణంగానే ఎన్డీయే ఘనవిజయం సాధించిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
పాట్నా: బిహార్ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడంతో ఓటమి చవిచూసిన పార్టీలు ఇందుకు కారణాలను విశ్లేషించుకుంటున్నాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన ప్రశాంత్ కిషోర్ 'జన్ సురాజ్' (Jan Suraaj) పార్టీ ఖాతా కూడా తెరవకుండానే ఘోర వైఫల్యాన్ని చవిచూసింది. దీనిపై తొలిసారిగా మీడియా సమావేశంలో మంగళవారంనాడు ఆయన స్పందించారు. నిజాయితీగా తాము చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, పార్టీ ఓటమికి తాను పూర్తి బాధ్యత వహిస్తున్నానని చెప్పారు. తప్పులను సరిచేసుకుని మరింత బలంగా ముందుకు వస్తామని, వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు.
ఒకరోజు మౌన వ్రతం
'మావైపు నుంచి చాలా పాజిటివ్‌గా పనిచేశాం. కానీ ఎక్కడో పొరపాటు జరిగింది. ప్రభుత్వాన్ని మార్చడంలో విఫలమయ్యాం. ప్రజలను అర్ధం చేసుకోవడంలో విఫలమైనందుకు నేనే బాధ్యత తీసుకుంటున్నాను. ఆత్మపరిశీలన చేసుకుంటాం. ఒకరోజు మౌనవ్రతం పాటిస్తున్నాను' అని అన్నారు.
ఓట్లు రాకపోవడం నేరం కాదు
తాము పొరపాట్లు చేసి ఉండవచ్చనీ, అయితే ఎలాంటి నేరం చేయలేదని, ఓట్లు సాధించలేకపోవడం నేరం కాదని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 'కుల రాజకీయాలకు పాల్పడలేదు. హిందూ-ముస్లిం విభజన కథనాలు చెప్పలేదు. విష ప్రచారం సాగించలేదు. పేదలు, అమాయక ప్రజల ఓట్లు కొనుగోలు చేయడమనే నేరానికి పాల్పడలేదు. అలాంటి పనులు చేసినవాళ్లు అందుకు తగిన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అభిమన్యుడిని యుద్ధంలో చంపినా మహాభారతంలో వారికి విజయం దక్కలేదు. న్యాయం వైపు ఉన్నవారే గెలిచారు. విజయం మావైపే ఉంది' అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు.
ఎన్డీయే గెలుపు కారణమదే
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక ప్రభుత్వం ప్రజల కోసం రూ.40,000 కోట్లు ఖర్చుచేస్తామని ప్రకటించడం ఇదే మొదటిసారని, ఆ కారణంగానే ఎన్డీయే ఘనవిజయం సాధించిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. 'రూ.10,000కు ఓటర్లు అమ్ముడు పోయినట్టు జనం చెబుతున్నారు. అది నిజం కాదు. ప్రజలు తమ భవిష్యత్తును, పిల్లల భవిష్యత్తును అమ్ముకోలేదు. ఈ చర్చ ఇలా సాగుతూనే ఉంటుంది. కొందరు ఎన్నికల కమిషన్ తప్పిదాలకు పాల్పడిందని చెబుతున్నారు. వాళ్ల వాదన వాళ్లది. కానీ, ప్రతీ నియోజకవర్గంలోనూ కనీసం 60,000 నుంచి 62,000 మందికి రూ.10,000 ఇచ్చారు. రూ.2 లక్షల రుణాలు ఇస్తామని వాగ్దానం చేసారు. ఎన్డీయే అధికారంలోకి వస్తేనే లోన్లు వస్తాయని విధి నిర్వహణలో ఉన్న అధికారులు ప్రచారం చేశారు. జీవికా దీదీలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు' అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
పోస్టే తీసుకోలేదు.. దేనికి రిజైన్ చేయాలి?
మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ప్రశాంత్ కిషోర్ స్పందిస్తూ, పార్టీలో తాను ఎలాంటి పదవి తీసుకోలేదని, అలాంటప్పుడు ఏ పదవికి రాజీనామా చేయాలని ప్రశ్నించారు. బీహార్‌ను వదిలిపెడతానని తాను చెప్పలేదని, రాజకీయాలు చేయనని మాత్రమే చెప్పానని, ఆ మాటమీదే ఉన్నానని అన్నారు. కాగా, ఇటీవల ఎన్నికల వైఫల్యం అనంతరం ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినట్టుగా 1.5 కోట్ల మంది ప్రజలకు రూ.2 లక్షల చొప్పున ఇస్తామన్న హామీని నితీష్ ప్రభుత్వం నిలబెట్టుకుంటే తాను నిశ్చయంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
చిన్నారుల మిస్సింగ్‌పై సుప్రీంకోర్టు ఆందోళన
ఎర్రకోట బాంబ్ బ్లాస్ట్.. పేలుడుకు ముందు వీడియో రికార్డ్ చేసిన ఉమర్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.