Supreme Court Warns: న్యూ ఇయర్‌కి ఎక్కడుంటారో తేల్చుకోండి!
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:46 AM
తెలంగాణలో 10 మంది శాసన సభ్యుల ఫిరాయింపు వ్యవహారంపై స్పీకర్ విచారణలో జాప్యాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. రోజువారీగా విచారించాలని, ఎమ్మెల్యేలు సహకరించకపోతే వేటు వేయాలని గత ఆదేశాల్లోనే స్పష్టం చేశామని గుర్తు చేసింది.....
ఆదేశాలు పాటిస్తారా? ధిక్కారం కేసు ఎదుర్కొంటారా?.. 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తేల్చండి
తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు హెచ్చరిక.. నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యంపై తీవ్ర అసహనం
రోజువారీగా విచారించాలని గతంలోనే చెప్పాం.. ఎమ్మెల్యేలు సహకరించకపోతే వేటు వేయాలన్నాం
సభాపతికి గుర్తు చేసిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్.. స్పీకర్‌తోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ
న్యూఢిల్లీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 10 మంది శాసన సభ్యుల ఫిరాయింపు వ్యవహారంపై స్పీకర్ విచారణలో జాప్యాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. రోజువారీగా విచారించాలని, ఎమ్మెల్యేలు సహకరించకపోతే వేటు వేయాలని గత ఆదేశాల్లోనే స్పష్టం చేశామని గుర్తు చేసింది. తమ ఆదేశాలు పాటిస్తారో? లేదంటే కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొంటారో? సభాపతి తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ‘‘అనర్హత అంశంపై నాలుగు వారాల్లో తేల్చండి.. లేదంటే న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకుంటారో నిర్ణయించుకోండి?’’ అని స్పీకర్‌ను ఉద్దేశించి అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసింది. ఎమ్మెల్యేల అనర్హత అంశంపై వీలైనంత త్వరగా, లేదంటే మూడు నెలల్లో విచారించి నిర్ణయం తీసుకోవాలని ఈ ఏడాది జూలై 31 సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు విధించిన గడువు అక్టోబరు 31తో ముగిసింది. స్పీకర్‌గా రాజ్యాంగ బాధ్యతలు, హైదరాబాద్‌లో వరదలు, రోజువారీ కార్యక్రమాలు, అంతర్జాతీయ సదస్సులు, విదేశీ పర్యటనల కారణంగా సుప్రీంకోర్టు విధించిన గడువులోగా విచారించడం సాధ్యం కాలేదని చెబుతూ అక్టోబరు 31న స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్న ఎమ్మెల్యేలు సైతం అభివృద్థి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అకాల వర్షాల నేపథ్యంలో వరద సహాయక చర్యల్లో పాల్గొనడం కారణంగా నియోజక వర్గాల్లోనే ఉండాల్సి వస్తోందని, మరో ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై విచారణలో స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే తాత్సారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. గడువు కోరుతూ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు బీఆర్‌ఎస్ రెండు పిటిషన్లు కలిపి సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్, జస్టిస్ అంజారియాలతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఉద్దేశ పూర్వకంగానే స్పీకర్ తాత్సారం: బీఆర్‌ఎస్
అసెంబ్లీ స్పీకర్‌కు అనర్హత పిటిషన్లపై విచారణను ముగించాలనే ఉద్దేశం లేదని, కావాలనే తాత్సారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేనందున విచారణను వాయిదా వేయాలని ప్రభుత్వం తరఫున స్టాండింగ్ కౌన్సిల్ శ్రవణ్ కోరారు. ఉదయమే ఒకసారి పాస్ ఓవర్ అడిగితే ఇచ్చామని, ఇంకెన్ని సార్లు ఇవ్వాలని సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ఎండ్ ఆఫ్ ది బోర్డు(రోజులో చివరి కేసుగా) విచారించాలని శ్రవణ్ అభ్యర్థించగా, సీజేఐ తిరస్కరించారు. రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రవణ్ వాదనలు వినిపించడం ప్రారంభించారు. నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ పూర్తయిందని, తీర్పు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ‘‘పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై రోజువారీ విచారణ జరపాలని గతంలోనే చెప్పాం కదా?’’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాది ఆర్యమ సుందరం కలుగజేసుకుని, నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా స్పీకర్ మూడు వారాల క్రితం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మరో నలుగురికి సంబంధించి ఆధారాలన్నీ సమర్పించినా విచారణ తేదీలు ఇవ్వలేదని తెలిపారు. ఫిరాయింపు వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలు స్పీకర్ నోటీసులకు కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని వెల్లడించారు. స్పీకర్ కావాలనే కాలయాపన చేస్తున్నారని, అనర్హతపై నిర్ణయం తీసుకునే ఉద్దేశం ఆయనకు లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాలను ఏ మాత్రం లెక్కచేయలేదని, దీనిని అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నదని, స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇవ్వాలని కోరారు. స్పీకర్ కార్యాలయం తరఫున మరోసారి శ్రవణ్ వాదనలు వినిపించేందుకు సిద్థమయ్యారు. ఈలోగా సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వి కోర్టు హాలుకు చేరుకున్నారు. అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూ, హైదరాబాద్‌లో వరదల కారణంగా 10 రోజులు ఆలస్యం అయిందని, విచారణ పూర్తి చేయడానికి మరో ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని ధర్మాసనం ఎదుట అభ్యర్థించారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 20 మంచి నిర్ణయాలు తీసుకున్నామని, మరో ఎనిమిది, తొమ్మిది వారాల సమయం ఇస్తే మరింత పురోగతి సాధ్యమని తెలిపారు. సింఘ్వి అభ్యర్థనపై సీజేఐ, జస్టిస్ బీఆర్ గవాయి అసహనం వ్యక్తం చేశారు. ‘‘10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపునకు సంబంధించి రోజువారీగా విచారించాలని గత ఆదేశాల్లో స్పష్టం చేశాం.
ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్యేలు ఉద్దేశ పూర్వకంగా విచారణను పొడిగించాలని చూస్తే వేటు వేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం. మళ్లీ వచ్చి సమయం అడుగుతున్నారు. ఇదేం మంచి పద్థతి కాదు. ఎమ్మెల్యేల అనర్హతపై చర్యలు తీసుకుంటారో? కోర్టు ధిక్కారాన్ని ఎదుర్కొంటారో? ఆయన(స్పీకర్‌ను ఉద్దేశిస్తూ) ఇష్టం. 10వ షెడ్యూల్ పరిధిలోని అంశాలను పరిగణనలోకి తీసుకునే సమయంలో స్పీకర్‌కు రాజ్యాంగ పరమైన అంశాల్లో వెసులుబాటు ఉండదు. ఈ విషయాన్ని గత మా తీర్పులోనే స్పష్టంగా తెలియజేశాం. ఇక ఆయన ఇష్టం. నాలుగు వారాల్లో తేలుస్తారో? లేదంటే ఈ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడైనా, ఇంకెక్కడైనా చేసుకోవాలని నిర్ణయించుకుంటారో? ఆయన ఇష్టం’’ అని జస్టిస్ గవాయ్ హెచ్చరికగా వ్యాఖ్యానించారు. ఎనిమిది వారాల సమయం ఇవ్వాలని, తప్పనిసరిగా ఈలోపు విచారణను ముగిస్తామని అభిషేక్ సింఘ్వి అభ్యర్థించారు. అలా కుదరదని, రెండు వారాల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని సీజేఐ మౌఖికంగా ఉత్తర్వులు ఇస్తుండగా, మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి కనీసం నాలుగు వారాల సమయమైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం స్పీకర్‌తోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీచేస్తూ తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు కేసుల జాబితా ప్రకారం ఈ అంశం మరోసారి డిసెంబర్ 19న విచారణకు వచ్చే అవకాశముంది.
ఇదీ నేపథ్యం
ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. అదేరోజు ఎమ్మెల్యేలు పరిగి శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, టి.ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎం.సంజయ్ కుమార్ పార్టీలు ఫిరాయించారని కేటీ రామారావు, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చింత ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంలో రిట్ పిటిషన్(సివిల్) వేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్‌రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్(సివిల్) దాఖలు చేశారు. దానం నాగేందర్‌ని ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లు అన్నింటినీ కలిపి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి జూలై 31న తీర్పు వెలువరించింది.