Nitesh Rane: ఆమె అనుమతి తీసుకున్నారా? పొత్తులపై ఉద్ధవ్ థాకరేకు సూటిప్రశ్న
ABN , Publish Date - Apr 20 , 2025 | 07:11 PM
శివసేన, యూబీటీ మధ్య పొత్తు ఉంటుందని అనుకుంటున్నారా అని నితేష్ రాణేను అడిగినప్పుడు, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ సారథ్యంలోని మహాయుతికి బలమైన తీర్పునిచ్చారని, ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉన్నా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.

ముంబై: థాకరే సోదరులు ఉద్ధవ్ థాకరే, రాజ్ థాకరే మళ్లీ ఏకం కాబోతున్నారంటూ ప్రచారం జరుగుతుండటం, ఇందుకు అనుగుణంగా సోదరులిద్దరూ సంకేతాలు ఇవ్వడంపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితేష్ రాణే (Nitish Rane) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాము ఏకమయ్యే అవకాశాలున్నాయంటూ ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాకరే చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ థాకరే స్పందించే ముందు ఆయన తన భార్య రష్మి థాకరేను సంప్రదించారా? అని ప్రశ్నించారు.
మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు తమ మధ్య ఉన్న చిన్నచిన్న విభేదాలను సైతం పక్కనపెట్టేందుకు సుముఖంగా ఉన్నామని రాజ్, ఉద్ధవ్ థాకరేలు తాజాగా సంకేతాలిచ్చారు. దీనిపై నితేష్ రాణే మాట్లాడుతూ.. ''ఎంఎన్‌ఎస్‌తో చేతులు కలిపే ముందు రష్మి థాకరే అనుమతిని ఉద్ధవ్ థాకరే తీసుకున్నారా అని మీరు ప్రశ్నించండి. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాల్లో ఆమె అభిప్రాయానికే ఎక్కువ విలువ ఉంటుంది. నిజానికి సోదరులిద్దరూ విడిపోయే ముందు పెద్దగా కారణాలేవీ లేవు. శివసేన నుంచి రాజ్‌థాకరే ఉద్వాసనలో ఆమె (రష్మి) పాత్ర ఉంది'' అని అన్నారు.
శివసేన, యూబీటీ మధ్య పొత్తు ఉంటుందని అనుకుంటున్నారా అని రాణేను అడిగినప్పుడు, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు బీజేపీ సారథ్యంలోని మహాయుతికి బలమైన తీర్పునిచ్చారని, ఆ రెండు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉన్నా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు.