Rahul Gandhi: ఆ టీచర్లకు న్యాయం చేయండి.. రాష్ట్రపతి జోక్యం కోరుతూ రాహుల్ లేఖ
ABN , Publish Date - Apr 08 , 2025 | 05:54 PM
రిక్రూట్‌మెంట్ ప్రక్రియ రద్దు చేయడంతో వేలాది మంది అర్హులైన టీచర్లు ఉపాధి కోల్పోయినట్టు శిక్షక్ శిక్షకా అధికార్ మంచ్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని, రాష్ట్రపతి జోక్యం కోరుతూ లేఖ రాయాల్సిందిగా తనకు విజ్ఞప్తి చేశారని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్‌లో 2016లో నిర్వహించిన టీచర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈనెల 3న సుప్రీంకోర్టు సమర్ధించడంతో 25,000 మందికి పైగా టీచర్లు, సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ విషయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జోక్యం చేసుకోవాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కోరారు. ఈ మేరకు రాష్ట్రపతికి ఆయన లేఖ రాశారు. సక్రమమైన రీతిలో ఎంపికైన టీచర్లను విధుల్లో కొనసాగేలా చూడాలని, వారికి న్యాయం చేయాలని రాష్ట్రపతిని కోరారు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ రద్దు చేయడంతో వేలాది మంది అర్హులైన టీచర్లు ఉపాధి కోల్పోయినట్టు శిక్షక్ శిక్షకా అధికార్ మంచ్ ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారని, రాష్ట్రపతి జోక్యం కోరుతూ లేఖ రాయాల్సిందిగా తనకు విజ్ఞప్తి చేశారని రాహుల్ ఆ లేఖలో పేర్కొన్నారు. మంచ్ ప్రతినిధుల విజ్ఞాపన పత్రం ప్రతిని కూడా రాహుల్ రాష్ట్రపతికి రాసిన లేఖకు జత చేశారు.
AICC Convention: మతపరమైన విభజనలతో ప్రజా సమస్యలు బేఖాతరు.. బీజేపీపై ఏఐసీసీ సదస్సులో ఖర్గే
"టీచర్ల నియామక ప్రక్రియలో తీవ్ర అవకతవకలు జరిగాయని గుర్తిస్తూ నియామక ప్రక్రియ చెల్లదని కోల్‌కతా హైకోర్టు తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ఏప్రిల్ 3న సమర్ధించింది. దీంతో టీచర్లు, సిబ్బంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. వారి ఆశలన్నీ అడియాశలయ్యే దశలో ఉన్నారు'' అని రాహుల్ పేర్కొన్నారు. కొందరు అభ్యర్థులు సహజ ప్రక్రియలో ఎంపికయ్యారని, మరి కొందరు అనుచిత మార్గాల ద్వారా ఎంపికయ్యారని రెండు తీర్పుల్లోనూ (హైకోర్టు, సుప్రీంకోర్టు) ఉందని, అయితే రిక్రూట్‌మెంట్ ప్రక్రియతో కళంకితులతో పాటు, నిష్కళంకితులు కూడా ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. రిక్రూట్‌మెంట్‌లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఖండించాల్సిందేనని, ఇందుకు పాల్పడిన వారికి శిక్షించాలని, అయితే సక్రమ రీతిలో ఎన్నికైన టీచర్లను సైతం కళంకిత టీచర్లతో సమానంగా శిక్షించడం తీవ్ర అన్యాయం చేయడం అవుతుందని రాహుల్ ఆ లేఖలో రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.
కళంకిత టీచర్లు సైతం సుమారు పదేళ్లుగా సేవలందిస్తున్నారని రాహుల్ గుర్తు చేశారు. టీచర్లందిరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం వల్ల లక్షలాది మంది పాఠశాలల్లో విద్యార్థులకు చదువు చెప్పే వాళ్లు లేకుండా పోతారని, పిల్లల భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఇది శరాఘాతం అవుతుందని తెలిపారు. ''మేడమ్... మీరు గతంలో టీచర్‌గా కూడా పనిచేశారు. టీచర్లు, వారి కుటుంబాలు, విద్యార్థుల కష్టాలు మీకు తెలియనివి కావు. వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో సరైన రీతిలో ఎంపికైన వారిని విధుల్లో కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించాలని మిమ్మల్ని కోరుతున్నాను'' అని రాష్ట్రపతికి రాసిన లేఖలో రాహుల్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Supreme Court Closes NTA Case: ఎన్‌టీఏపై కేసును మూసివేసిన సుప్రీంకోర్టు
Heavy Rains: ఈరోడ్‌లో వర్షబీభత్సం.. అరటి తోటలు ధ్వంసం
For National News And Telugu News