Lalu Family Feud: తేజస్వీకి దురహంకారం తగదు.. రోహిణి ఆచార్యకు మద్దతుగా రబ్రీదేవి సోదరుడు
ABN , Publish Date - Nov 17 , 2025 | 09:47 PM
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయంపై తేజస్వీని సాధుయాదవ్ తప్పుపట్టారు. తేజస్వి సలహాదారులకు ఏమాత్రం విషయం పరిజ్ఞానం లేదని అన్నారు.
పాట్నా: ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చెలరేగిన కలహాలు ముదురుతున్నాయి. తేజస్వి యాదవ్, ఆయన అనుయాయులు తనను అవమానించి, దాడికి ప్రయత్నించారంటూ లాలూ కుమార్తె రోహిణి ఆచార్య (Rohini Acharya) ఆరోపిస్తూ రాజకీయాలతో పాటు కుటుంబానికి ఉద్వాసన చెప్పడం కలకలం రేపింది. దీనిపై రబ్రీదేవి సోదరుడు, ఆర్జేడీ మాజీ ఎంపీ అనురుధ్ ప్రసాద్ యాదవ్ అలియాస్ సాధు యాదవ్ (Sadhu Yadav) తాజాగా స్పందించారు. రోహిణి ఆచార్యకు మద్దతుగా నిలుస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ చతికిలపడడానికి తేజస్వి యాదవ్ బాధ్యుడని అన్నారు.
'లాలూ కుటుంబ సభ్యులు కాకుండా బయట వ్యక్తులు ఇందుకు బాధ్యులైతే ఇది చాలా దురదృష్టకరం. ఈ కలహాలు కుటుంబానికి కానీ, పార్టీకి కానీ మంచిది కాదు' అని సాధు యాదవ్ అన్నారు. ఆయన (తేజస్వి) అనుచితంగా ప్రవర్తించి ఉంటే అది దురదృష్టకరమని, దీనికి రోహిణిని ఎలా బాధ్యురాలిని చేస్తారని ప్రశ్నించారు. 'తేజస్వి మంచివాడైతే ఆయన తన కిడ్నీని ఎందుకు తండ్రికి (లాలూ) ఇవ్వలేకపోయారు?. ఆయనకు పదవే కావాలంటే ఆయనే స్యయంగా కిడ్నీ ఇచ్చి ఉండొచ్చు. ఆయన రోహిణికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు?' అని సాధు యాదవ్ నిలదీశారు.
చెప్పుడు మాటల వల్లే..
అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఘోర పరాజయంపై తేజస్విని సాధుయాదవ్ తప్పుపట్టారు. తేజస్వి సలహాదారులకు ఏమాత్రం విషయం పరిజ్ఞానం లేదన్నారు. 'తన తండ్రి అన్నీ చేస్తాడని అతను (తేజస్వి) అనుకుంటారు. కానీ పార్టీ నిర్మాణం వెనుక సాధు యాదవ్ ఉన్నారు. సొంత కుటుంబాన్ని తేజస్వి తప్పుపడతారు. ఇప్పుడు ఆయన పార్టీ పని ముగిసిపోయింది. కేవలం 25 సీట్లు గెలుచుకుంది' అని వివరించారు. కాగా, రోహిణి ఆచార్య ఆరోపణలపై ఆమె పెద్దన్నయ్య తేజ్ ప్రతాప్ మాత్రమే ఇంతవరకూ స్పందించారు. తన సోదరిని ఎవరైనా అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తేజ్ ప్రతాప్ సైతం ఇటీవల ఆర్జేడీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరణకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి..
పాతాళంలో దాక్కున్నా వేటాడతాం.. ఢిల్లీ పేలుడు ముష్కరులకు అమిత్‌షా వార్నింగ్
ఆయుధ నిల్వల ఆరోపణలపై బెంగాల్ రాజ్‌భవన్‌లో తనిఖీలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.