Sheikh Hasina: నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం.. షేక్ హసీనా మరణశిక్షపై భారత్
ABN , Publish Date - Nov 17 , 2025 | 07:54 PM
ఐసీటీ ఇచ్చిన తీర్పును షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్షపడేలా చేసిందన్నారు.
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా (Sheikh Hasina)కు మరణశిక్ష విధిస్తూ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) ఇచ్చిన తీర్పుపై భారత విదేశాంగ శాఖ ఆచితూచి స్పందించింది. పొరుగుదేశంగా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపింది. ఇందుకోసం సంబంధిత పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.
'బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు సంబంధించి ఐసీటీ ఇచ్చిన తీర్పును గమనించాం. పొరుగుదేశంగా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నాం. బంగ్లాలో శాంతి, ప్రజాస్వామం, స్థిరత్వం విషయంలో అన్ని పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం' అని విదేశాంగ శాఖ తెలిపింది.
తీర్పు ఏమిటి?
మానవత్వానికి వ్యతిరేకంగా షేక్ హసీనా నేరాలకు పాల్పడినట్టు ఐసీటీ నిర్ధారిస్తూ ఆమెకు మరణశిక్ష విధిస్తున్నట్టు సోమవారంనాడు తీర్పునిచ్చింది. 2024 జూలై, ఆగస్టుల్లో జరిగిన ఆందోళనల్లో 1400 మంది మృతి చెందారని, 24,000 మంది గాయపడ్డారని ఐసీటీ న్యాయమూర్తి పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ప్రజలను రజాకార్లుగా, ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి హింసను హసీనా రెచ్చగొట్టారని, ఆమెపై అభియోగాల నిర్ధారణకు తగిన ఆధారాలున్నాయని చెప్పారు. హసీనాతో పాటు మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్, మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మామూన్‌కు కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.
తీర్పు రాజకీయ ప్రేరేపితం: హసీనా
ఐసీటీ ఇచ్చిన తీర్పును షేక్ హసీనా ఖండించారు. ఈ తీర్పు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం కుట్రపూరితంగా తనకు శిక్షపడేలా చేసిందన్నారు. కోర్టులో తన వాదన వినిపించే సరైన అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌ను అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో చేరేలా చేసిందే తమ ప్రభుత్వమని గుర్తుచేశారు. మానవహక్కుల పట్ల తమకు శ్రద్ధ ఉన్నందువల్లే మయనార్మ్ హింసతో బంగ్లాకు పారిపోయి వచ్చిన లక్షలాది మంది శరణార్ధులకు ఆశ్రయమిచ్చామని చెప్పారు.
అప్పగించాలని భారత్‌కు బంగ్లా లేఖ
హసీనాకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన వెంటనే ఆమెను తమకు అప్పగించాలంటూ బంగ్లా విదేశాంగ శాఖ భారత్‌కు లేఖ రాసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారికి ఆశ్రయం కల్పించడం వంటి చర్యలు దౌత్యపరంగా సరైనవి కావని, న్యాయం పట్ల నిర్లక్ష్యమే అవుతుందని తెలిపింది. ఇది స్నేహపూర్వక బాధ్యతని ఆ లేఖలో పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
ఆయుధ నిల్వల ఆరోపణలపై బెంగాల్ రాజ్‌భవన్‌లో తనిఖీలు
88 గంటల ఆపరేషన్ సిందూర్ జస్ట్ ట్రైలర్... ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.