Naveen Patnaik: పూరీ రథయాత్ర దుర్ఘటన.. ప్రభుత్వంపై మాజీ సీఎం విమర్శలు
ABN , Publish Date - Jun 29 , 2025 | 01:26 PM
పూరీలో జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025) సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

పూరీలో జరిగిన జగన్నాథ రథయాత్ర (Puri Rath Yatra 2025)లో తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ (Naveen Patnaik) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన గుండిచా ఆలయం సమీపంలో జరిగింది. ఇది ప్రధాన జగన్నాథ ఆలయం నుంచి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటనపై బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, నవీన్ పట్నాయక్ బీజేడీ పార్టీ మధ్య ప్రస్తుతం వాడీవేడి చర్చ కొనసాగుతోంది.
పట్నాయక్ ఏమన్నారంటే..
ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్ ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేసి స్పందించారు. ఈ ఘటనను ప్రభుత్వ అసమర్థతగా అభివర్ణించారు. రథయాత్రలో జన సమూహం నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ దుర్ఘటన భక్తులకు శాంతియుత పండుగను అందించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టం చేస్తుందన్నారు. రథయాత్ర రోజున నందీఘోష రథాన్ని లాగడంలో జాప్యం జరిగిందని, దీనిని ప్రభుత్వం మహాప్రభు ఇచ్ఛ అని సమర్థించుకుందని నవీన్ పట్నాయక్ ఆరోపించారు. ఈ జాప్యం ప్రభుత్వం బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుందన్నారు.
సిబ్బంది కూడా లేరని..
దీంతోపాటు ఈ ఘటన సమయంలో భారీ జన సమూహాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ సిబ్బంది కూడా అక్కడ లేరని ఆయన విమర్శించారు. దీంతోపాటు రథయాత్రలో భాగంగా కీలక ఆచారాలైన అడప బిజె, బహుదా, సునా బేషా వంటివి సజావుగా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో మరణించిన భక్తుల కుటుంబాలకు నవీన్ పట్నాయక్ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు (Naveen Patnaik) చెప్పారు.
బీజేపీ రియాక్షన్
ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్, నవీన్ పట్నాయక్ పేరును ప్రస్తావించకుండా, బీజేడీ పార్టీపై ప్రతి విమర్శలు చేశారు. గతంలో బీజేడీ ప్రభుత్వం రథయాత్ర నిర్వహణలో తప్పిదాలు చేసిందన్నారు. జగన్నాథ స్వామిని అవమానించిందని ఆయన ఆరోపించారు. 1977 నుంచి రథాలు ఎల్లప్పుడూ రెండో రోజున గుండిచా ఆలయానికి చేరుకుంటాయని హరిచందన్ అన్నారు. బీజేడీ పచ్చకామెర్లతో రాజకీయ వ్యాఖ్యలు చేస్తోందన్నారు. పండుగ సమయంలో రాజకీయాలు చేసే వారు ఈ రోజు కాకపోతే రేపు ఫలితాలను ఎదుర్కొంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని హరిచందన్ హామీ ఇచ్చారు.
రథయాత్రలో సమస్యలు
రథయాత్రలో మూడు రథాలు జగన్నాథ ఆలయం నుంచి గుండిచా ఆలయం వరకు సగం దూరం కూడా చేరుకోలేదు. ఎందుకంటే భారీ జన సమూహం మధ్య రథాలను లాగడానికి ఆటంకం ఏర్పడింది. ఈ ఘటన రథయాత్ర నిర్వహణలో ప్రభుత్వం ఎదుర్కొన్న సవాళ్లను ప్రస్తావిస్తుంది. రథయాత్ర సందర్భంగా, గుండిచా ఆలయం సమీపంలో ట్రక్కులు చేరడంతో అక్కడ కూర్చొన్న అనేక మంది భక్తుల మధ్య గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
ఇవీ చదవండి:
కొత్త ఫ్లాష్ సేల్ ఆఫర్.. రూ.400కు 400 జీబీ డేటా
సిబిల్ స్కోర్ కారణంగా ఉద్యోగం తొలగింపు..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి