Share News

వాయుసేన రన్‌వేనే అమ్మేశారు!

ABN , Publish Date - Jul 02 , 2025 | 06:00 AM

ఓ సినిమాలో రవీంద్ర భారతి, చార్మినార్‌ తనదేనని చెబుతూ అమ్మకానికి పెట్టి అమాయకుల నుంచి అందినకాడికి వసూలు చేసుకుంటాడో మోసగాడు! పంజాబ్‌లో అచ్చంగా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది.

వాయుసేన రన్‌వేనే అమ్మేశారు!

  • పంజాబ్‌లోని హల్వారా ఎయిర్‌ఫోర్స్‌లోని 15 ఎకరాలను విక్రయించిన తల్లి, కుమారుడు

న్యూఢిల్లీ, జూలై 1: ఓ సినిమాలో రవీంద్ర భారతి, చార్మినార్‌ తనదేనని చెబుతూ అమ్మకానికి పెట్టి అమాయకుల నుంచి అందినకాడికి వసూలు చేసుకుంటాడో మోసగాడు! పంజాబ్‌లో అచ్చంగా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ మహిళ, ఆమె కుమారుడు కలిసి వాయుసేనకు చెందిన ఓ రన్‌వే స్థలాన్ని తెగనమ్మేశారు! కొందరు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై ఆ తల్లీకొడుకులు ఈ అక్రమానికి పాల్పడటం పంజాబ్‌లో తీవ్ర సంచలనమైంది. నిందితులు పంజాబ్‌లోని డుమినివాలా గ్రామానికి చెందిన ఉషా అన్సాల్‌, ఆమె కుమారుడు నవీన్‌ చంద్‌! పాక్‌ సరిహద్దులోని ఫట్టువాలా గ్రామ శివారులో గల రక్షణ శాఖ పరిధిలోని 982 ఎకరాల్లో విస్తరించి ఉన్న ‘హల్వారా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌’లోని రన్‌వే స్థలం ఇది! మన మిలటరీకి అత్యంత వ్యూహాత్మక ప్రాంతంగా దీన్ని చెబుతారు. 1939-45 మధ్య రెండో ప్రపంచ యుద్ధంలో ఈ రన్‌వేను బ్రిటిషర్లు ఉపయోగించుకున్నారు.


పైగా పొరుగు దేశాలతో 1962, 1965, 1971 జరిగిన యుద్ధాల్లో ఈ రన్‌వేను భారత వాయుసేన అత్యవసర ల్యాండింగ్‌ కోసం, రక్షణ పరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంది. 1997లో ఉష, నవీన్‌ కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి 15 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఈ రన్‌నేను ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. అప్పట్లోనే నిషాన్‌ సింగ్‌ అనే మాజీ రెవెన్యూ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ భూ కుంభకోణం వెలుగులోకొచ్చింది. అయితే 2021 వరకు అధికారులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. ఈ భూకుంభకోణంపై మూడేళ్ల క్రితం హల్వారా ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ అధికారులు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ నిషాన్‌ సింగే, ఈ భూకుంభకోణంపై పంజాబ్‌, హరియాణా కోర్టును ఆశ్రయించారు. స్పందించిన కోర్టు.. నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక అందజేయాలంటూ పంజాబ్‌ విజిలెన్స్‌ బ్యూరో చీఫ్‌ను ఆదేశించింది. అయితే ఈ ఏడాది మే నెలలోనే ఎయిర్‌ఫోర్స్‌ భూమిని తిరిగి రక్షణ శాఖకు స్వాధీన పరిచారు.

Updated Date - Jul 02 , 2025 | 06:00 AM