CM Rangaswamy: పుదుచ్చేరి సీఎం విధుల బహిష్కరణ
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:02 AM
పరిపాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ కైలాశ్‌నాథ్ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరుకు నిరసనగా కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరిలో సీఎం రంగస్వామి..

పుదుచ్చేరిలో 3 రోజులుగా స్తంభించిన పాలన
లెఫ్టినెంట్ గవర్నర్ నిరంకుశ వైఖరికి వినూత్న నిరసన
చెన్నై, జూలై 10(ఆంధ్రజ్యోతి): పరిపాలనా వ్యవహారాల్లో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) కైలాశ్‌నాథ్ అతిగా జోక్యం చేసుకుంటున్న తీరుకు నిరసనగా కేంద్రపాలితప్రాంతం పుదుచ్చేరిలో సీఎం రంగస్వామి, ఆయన పార్టీకి చెందిన మంత్రివర్గ సహచరులు మూడు రోజులుగా విధులను బహిష్కరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన ఎన్‌ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి సీఎం పీఠం దక్కించుకున్న విషయం తెలిసిందే. బీజేపీకి కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారు. అయితే, తాను పేరుకే ముఖ్యమంత్రినని, కనీసం విద్యార్థుల నోటుపుస్తకాలకు కూడా నిధులు విడుదల చేయలేని స్థితిలో ఉన్నానంటూ పలుమార్లు ఆయన వాపోయారు. దీనికితోడు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా ఇస్తామన్న హామీపై కేంద్రం ఏమాత్రం స్పందించకపోవడం పట్ల ఆయన కినుక వహించారు. ఈ నేపథ్యంలో ఎల్జీ తనను కనీసం సంప్రదించకుండా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం, పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని రంగస్వామి జీర్ణించుకోలేకపోతున్నారు. పలు కళాశాలల్లో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్ల కాంట్రాక్టులను పునరుద్ధరించేందుకు క్యాబినెట్ చేసిన సిఫారసులను కూడా ఎల్జీ తిరస్కరించినట్లు సమాచారం. ఈ వ్యవహారాలపై రంగస్వామి కేంద్రాన్ని సంప్రదించినా స్పందన లేదని సమాచారం. దీంతో మనస్తాపం చెందిన రంగస్వామి, ఆయన మంత్రివర్గ సహచరులు మూడు రోజుల నుంచి విధులను బహిష్కరించారు. దీంతో పుదుచ్చేరిలో పాలన స్తంభించింది.