Prajwal Revanna: అదే నా తప్పు... కోర్టులో ఏడ్చేసిన ప్రజ్వల్
ABN , Publish Date - Aug 02 , 2025 | 09:16 PM
అత్యాచారం కేసులో బాధితురాలిగా చెబుతున్న మహిళ ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధంగా లేనప్పటికీ పోలీసులు బలవంతంగా ఆమె చేత ఫిర్యాదు చేయించారని ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. తాను విద్యాధికుడనని, తనపై తప్పుడు కేసు బనాయించారని, తాను ఎంపీగా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా అత్యాచారం ఫిర్యాదులు చేయలేదని అన్నారు.

న్యూఢిల్లీ: ఇంటి పని మనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు నమోదైన కేసులో దోషిగా తేలిన జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna) తనకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష్ గజానన్ భట్ శనివారం నాడు జీవితఖైదు విధించడంతో భావోద్వేగానికి గురయ్యారు. బిగ్గరగా ఏడ్చారు. తాను విద్యాధికుడనని, తనపై తప్పుడు కేసు బనాయించారని, తాను ఎంపీగా అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరు కూడా అత్యాచారం ఫిర్యాదులు చేయలేదని అన్నారు. శిక్షను తగ్గించాల్సిందిగా కోర్టును వేడుకున్నారు. తీర్పు అనంతరం న్యాయస్థానం నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన కంటతడి పెట్టారు.
రాజకీయ కుట్రే..
తాను అమాయకుడినని, తనపై రాజకీయ కుట్ర జరిగిందని ప్రజ్వల్ రేవణ్ణ తెలిపారు. రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తాను చేసిన ఏకైక తప్పని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారం కేసులో బాధితురాలిగా చెబుతున్న మహిళ ఫిర్యాదు ఇచ్చేందుకు సిద్ధంగా లేనప్పటికీ పోలీసులు బలవంతంగా ఆమె చేత ఫిర్యాదు చేయించారని ప్రజ్వల్ ఈ సందర్భంగా తెలిపారు. తాను 100 మందికి పైగా మహిళలను వేధించినట్టు మీడియా క్లెయిమ్ చేస్తే కేవలం నలుగురు మాత్రమే ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.
ఎంపీగా ఒక టర్మ్ పనిచేశానని, బాగా పనిచేసినట్లు పేరొచ్చిందని, అప్పుడు ఒక్క రేప్ ఆరోపణ కూడా రాలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తనపై అత్యాచార ఆరోపణలు చేశారని, రాజకీయాల్లో ఒక్కసారిగా ఎదగడమే తన తప్పిదమైందని అన్నారు. తాను మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయెట్‌నని, మెరిట్ స్టూటెంట్‌నని చెప్పారు. తల్లిదండ్రులను చూసి ఆరు నెలలైందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజ్వల్.
ఇవి కూడా చదవండి..
ఓటర్ల జాబితాలో నా పేరు లేదన్న తేజస్వి.. ఈసీ కౌంటర్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి