PM Narendra Modi: చెక్కుచెదరని విశ్వాసానికి సునీతా విలియమ్స్ నిదర్శనం: ప్రధాని మోదీ..
ABN , Publish Date - Mar 19 , 2025 | 12:32 PM
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ధైర్యానికి, అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా క్రూ-9 మిషన్ పరీక్ష అని ప్రధాని మోదీ అన్నారు.

ఢిల్లీ: నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్(Sunita Williams), బుచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) సంతోషం వ్యక్తం చేశారు. ధైర్యానికి, అపరిమిత మానవ స్ఫూర్తికి నాసా క్రూ-9 మిషన్ (Crew-9 Mission) పరీక్ష అని ప్రధాని మోదీ అన్నారు. సునీతా విలియమ్స్, క్రూ-9 వ్యోమగాములు పట్టుదల అంటే ఏంటో మరోసారి చూపించారంటూ కొనియాడారు. తెలియని విస్తారమైన పరిస్థితులను ఎదుర్కొన్నా చెక్కుచెదరని వారి అచంచలమైన సంకల్పం లక్షలాది మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తుందంటూ ఎక్స్ వేదికగా మోదీ ప్రశంసించారు.
అంతరిక్ష అన్వేషణ అంటే మానవశక్తి పరిమితులను అధిగమించడం.. కలలు కనడం, వాటిని వాస్తవంగా మార్చే ధైర్యం కలిగి ఉండడమని ప్రధాని చెప్పారు. ఈ మార్గదర్శకాలు పాటించి సునీతా విలియమ్స్ తన కెరీర్ అంతటా స్ఫూర్తిని ప్రదర్శించారని మోదీ కొనియాడారు. అభిరుచి, కచ్చితత్వం, సాంకేతిక పట్టుదల కలిస్తే ఏం జరుగుతుందో ప్రదర్శించి చూపారని ప్రశంసించారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సురక్షితంగా తిరిగి రావడానికి అవిశ్రాంతంగా కృషి చేసిన వారందరి చూసి తాము గర్విస్తున్నట్లు చెప్పారు మోదీ. కాగా, ఇప్పటికే సునీతా విలియమ్స్‌ను భారత్‍కు ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ లేఖ రాశారు.
అసలేం జరిగిందంటే..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)లో అనుకోని విధంగా తొమ్మిది నెలలు ఉండాల్సి వచ్చిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి చేరుకున్నారు. దాదాపు 286 రోజులపాటు స్పేస్ స్టేషన్‌లో ఉన్న వారిద్దరూ స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్ ద్వారా బుధవారం తెల్లవారుజామున 3:27కు పుడమికి చేరుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా సముద్రంలో విజయవంతంగా ల్యాండ్ అయ్యారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ గతేడాది జూన్‌లో ఎనిమిది రోజుల పర్యటన కోసం ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. అయితే బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో సమస్యలు తలెత్తడంతో వారిద్దరూ అక్కడే ఉండి పోవాల్సి వచ్చింది. స్పేస్ ఎక్స్, నాసా సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి క్రూ-9 మిషన్ ద్వారా వారిని భూమికి రప్పించారు. వీరితోపాటు ఆస్ట్రోనాట్లు నిక్ హేక్, గోర్బునోవ్ సైతం పుడమిపైకి చేరుకున్నారు.
సునీతా సాధించిన విజయాలు..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ 286 రోజులు గడిపారు. అక్కడ 4,576 సార్లు భూమి చుట్టూ తిరిగి 121 మిలియన్ స్టాట్యూట్ మైళ్లు (195 మిలియన్ కిలోమీటర్లు) ప్రయాణించారు. కాగా, సునీతా విలియమ్స్‌కు ఇది తన మూడో అంతరిక్ష పర్యటన. అంతరిక్షంలో ఆమె 608 రోజులు ఉండి అమెరికా వ్యోమగాముల చరిత్రలో పెగ్గీ విట్సన్ (675 రోజులు) తర్వాత రెండో వ్యక్తిగా నిలిచారు. కాగా, రష్యన్ వ్యోమగామి ఒలేగ్ కోనోనెంకో గతేడాది 878 రోజులు స్పేస్‌లో ఉండి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..