Share News

PM Modi: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:29 AM

భారత్‌, రష్యాలది డెడ్‌ ఎకాకమీ’ అంటూ పరుష వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, ఆయనను సమర్థించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ప్రధాని మోదీ పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు.

PM Modi: మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తున్నాం

  • ట్రంప్‌ ‘డెడ్‌ ఎకానమీ’ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ కౌంటర్‌

  • అస్థిరంగా ప్రపంచ పరిస్థితులు.. అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది

  • ప్రతి దేశమూ స్వలాభం కోసమే.. స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెడదాం: మోదీ

  • మాపై దాడికి తెగిస్తే పాతాళంలో ఉన్నా వదలం.. పాక్‌కు హెచ్చరిక

వారాణసీ, ఆగస్టు 2: ‘భారత్‌, రష్యాలది డెడ్‌ ఎకాకమీ’ అంటూ పరుష వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, ఆయనను సమర్థించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి ప్రధాని మోదీ పరోక్షంగా కౌంటర్‌ ఇచ్చారు. భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని స్పష్టంచేశారు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ విధానాలపై దృష్టి సారించాల్సి ఉన్నదని ఆయన అన్నారు. విపక్షాలు సైతం రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, స్వదేశీ ఉత్పత్తులకు ఉమ్మడి ప్రచారం కల్పించాలని ప్రధాని కోరారు. భారత్‌పై దాడికి తెగిస్తే ఏఒక్కరినీ వదిలిపెట్టబోమని, ఒకవేళ పాతాళంలో దాక్కున్నా వెతికి పట్టుకుంటామంటూ..దాయాదిదేశం పాకిస్థానఫై తీవ్రస్వరం వినిపించారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయాన్ని జీర్ణించుకోవడం కొంతమందికి కష్టంగా ఉన్నదంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు. మోదీ తన సొంత నియోజకవర్గం యూపీలోని వారాణసీలో శనివారం రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే పీఎం కిసాన్‌ యోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. భారత్‌పై 25 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తూ ట్రంప్‌ చేసిన ‘డెడ్‌ ఎకానమీ’ వ్యాఖ్యలతోపాటు ఆపరేషన్‌ సిందూర్‌, మహాదేవ్‌లపై విపక్షాల విమర్శలను కూడా ఈ సందర్భంగా మోదీ తిప్పికొట్టారు. ‘‘ప్రపంచ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. ప్రతి దేశం తన సొంత ప్రయోజనాలనే చూసుకుంటోంది. మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరిస్తున్న వేళ మన ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. దేశంకోసం ఏది ఉత్తమమో దాన్నంతా ప్రభుత్వం చేస్తోంది.’’ అని మోదీ అన్నారు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రజలను ఆయన కోరారు.


ముహూర్తం చూస్తామా?

కాంగ్రెస్‌, ఇతర విపక్షాలు పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను కూల్చడంపై కలత చెందుతున్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘‘పహల్గాం దాడి హంతకులను పార్లమెంటు సమావేశాలప్పుడే ఎన్‌కౌంటర్‌ ఎలా చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదులను చంపడానికి ముహూర్తం చూస్తామా? దొరికినప్పుడు చంపకుండా వదిలేస్తామా.?’’ అంటూ ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. ‘‘తన ఎదుట అన్యాయం, ఉన్మాదం జరుగుతుంటే మహాదేవుడు రౌద్రరూపం దాల్చుతారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ప్రపంచం ఇదే రూపాన్ని చూసింది. భారత్‌తో పెట్టుకుంటే ఎవరినీ వదిలిపెట్టం. ఆపరేషన్‌ సిందూర్‌ దెబ్బకు పాక్‌లోని వైమానిక స్థావరాలు ఇప్పటికీ ఐసీయూలోనే ఉన్నాయి. మన బ్రహ్మోస్‌ క్షిపణులు దాయాదికి నిద్రను దూరంచేశాయి. ఈ క్షిపణులను ఇకపై యూపీలోనే తయారుచేయబోతున్నాం. లఖనవూలో ఉత్పత్తిని ప్రారంభంచనున్నాం. అయితే, కొంతమందికి ఆపరేషన్‌ సిందూర్‌ విజయం రుచించకపోవడం దురదృష్టకరం. కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు మాత్రం పాక్‌ దుస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నాయి. ఉగ్రవాదుల పరిస్థితి చూసి అక్కడ పాక్‌, ఇక్కడ ఈ రెండు పార్టీలూ రోదిస్తున్నాయి. ఆపరేషన్‌ సిందూర్‌ను ‘తమాషా’గా తూలనాడుతూ, మన బలగాల శౌర్యప్రతాపాలను కాంగ్రెస్‌, ఎస్పీ నేతలు పదేపదే కించపరుస్తున్నారు’’ అని మోదీ మండిపడ్డారు.


రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు

వారాణసీ, ఆగస్టు 2 : పీఎం కిసాస్‌ యోజన కింద దేశవ్యాప్తంగా ఉన్న 9.70 కోట్లమంది రైతుల ఖాతాల్లో రూ.20,500 కోట్ల నిధులను ప్రధాని మోదీ జమ చేశారు. ఇది 20వ విడత సాయం. శనివారం తన సొంత నియోజకవర్గం వారాణసీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ నిధులను ఆయన విడుదల చేశారు. పీఎం కిసాన్‌ పథకాన్ని ఫిబ్రవరి 2019లో మోదీ ప్రారంభించారు. ఇప్పటివరకు అన్నదాతల ఖాతాల్లో 3.90 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. కాగా, వారాణసీ నియోజకవర్గ అభివృద్ధి లో భాగంగా రూ.రెండు వేల కోట్లకుపైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. 2014లో ఇక్కడినుంచి మోదీ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు 51 సార్లు తన నియోజకవర్గాన్ని ఆయన సందర్శించారని బీజేపీ రైతు విభాగం అధ్యక్షుడు దిలీప్‌ పటేల్‌ వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాంగ్రెస్‌ మాత్రమే మోదీని కుర్చీ నుంచి దింపగలదు: రేవంత్‌రెడ్డి

ప్రభుత్వ సొమ్ము తిన్నవాళ్లను తిరిగి కక్కిస్తాం.. మహేష్ గౌడ్ స్ట్రాంగ్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 05:29 AM