Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:27 PM
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణను ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తోంది. ఈ సందర్భంగా గుజరాత్‌కు చెందిన పర్యాటకుడు రిషి భట్‌ను విచారించింది. అతడు ఈ ఉగ్రదాడిపై పలు సంచలన విషయాలను వెల్లడించారు.

గాంధీనగర్, ఏప్రిల్ 29: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన విచారణను ముమ్మరం చేసింది. అందులోభాగంగా ఈ ఘటనపై ప్రత్యక్ష సాక్షులతో పాటు బాధిత కుటుంబాలను విచారిస్తోంది. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలువురి ప్రత్యక్ష సాక్షుల నుంచి కీలక విషయాలను ఎన్ఐఏ రాబట్టింది. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన రిషి భట్‌ను విచారించింది. ఈ సందర్భంగా ఈ ఘటనకు సంబంధించి అతడు పలు సంచలన విషయాలను వారికి వివరించారు.
పహల్గాం కాల్పులకు ఘటనకు కొద్ది నిమిషాల ముందు తాను జిప్ లైన్ ఎక్కేందుకు వెళ్లానని చెప్పారు. తన ముందు తొమ్మిది మంది ఉన్నారని.. వారంతా జిప్ లైన్ ఎక్కారని తెలిపారు. కానీ తాను జిప్ లైన్ ఎక్కిన సమయంలో.. దానిని అపరేట్ చేసిన వ్యక్తి మూడు సార్లు.. అల్లాహో అక్బర్.. అని బిగ్గరగా అరిచారని చెప్పారు. ఆ తర్వాత ఉగ్రవాదులు.. కాల్పులు జరపడం ప్రారంభించారని వివరించారు. ఈ నేపథ్యంలో జిప్ లైన్ అపరేటర్ పాత్రపై తనకు అనుమానం వ్యక్తమవుతోందన్నారు. అతడు సాధారణ కాశ్మీరీలో కనిపించాడని చెప్పారు.
ఈ జిప్‌లైన్‌లో ప్రయాణిస్తున్నప్పుడు తాను వీడియో తీశానని తెలపారు. అతడు తీసిన ఈ వీడియోలో కాల్పుల శబ్దం వినిపిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని నిమిషాల పాటు తనకు ఏం జరిగిందో అర్థం కాలేదని.. కొన్ని సెకన్ల తర్వాత అది ఉగ్రదాడి అని అర్థమైందన్నారు. తాను చూస్తుండగానే కొద్ది దూరంలో కొంత మందిని ఉగ్రవాదులు కాల్చేశారన్నారు. దీంతో జిప్ లైన్‌లోకి తన భార్యతోపాటు కుమారుడిని సైతం తాను లాగేశానని చెప్పారు.
ఈ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడుతూ.. మైదానంలోని వారిని మతం గురించి ప్రశ్నించారని గుర్తు చేసుకున్నారు. ఆ క్రమంలో భార్య, కుమారుడి కళ్లెదురుగానే ఒకరిని కాల్చేశారన్నారు. ఈ దృశ్యాన్ని చూసిన తన భార్య, కుమారుడు భయాందోళనకు గురయ్యారని వివరించారు. ఈ ఘటన చోటు చేసుకున్న వెంటనే ఆర్మీ స్పందించిన తీరు పట్ల రిషి భట్ కృతజ్జతలు తెలిపారు.
జమ్మూ కశ్మీర్, అనంతనాగ్ జిల్లాలోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 26 మంది మరణించారు. ఈ ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకొంది. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ఉన్నట్లు స్పష్టమైన సాక్ష్యాలను భారత్ సేకరించింది. ఈ సాక్ష్యాలను ప్రపంచదేశాల ముందు ఉంచిన విషయం తెలిసిందే. ఈ దాడి నేపథ్యంలో పాకిస్థాన్ లక్ష్యంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ క్రమంలో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. భారత్‌లో పర్యటిస్తున్న పాక్ పర్యాటకులు సైతం దేశం వీడాలని సూచించింది. అందుకు వారికి గడువు సైతం విధించింది. ఇక పాకిస్థాన్ సైతం అదే రీతిలో స్పందించిని సంగతి తెలిసిందే.
మరోవైపు సోమవారం ఎన్ఐఏ అధికారులు ఈ ఉగ్రదాడిలో మరణించిన బెంగళూరు వాసి భరత్ భూషణ్ భార్య సుజాతను సైతం ప్రశ్నించిన విషయం విధితమే. ఈ ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ బృందాలను ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో ఉగ్రదాడి సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న పర్యాటకులను దర్యాప్తులో భాగంగా విచారిస్తోందన్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
Seethakka On Operation Kagar: ఆపరేషన్ కగార్‌పై మంత్రి సీతక్క రియాక్షన్
Rahul letter to PM: పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానికి రాహుల్ లేఖ
Pakistani Citizens: హైదరాబాద్‌ను వీడిన పాకిస్థానీలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
For National News And Telugu News..