Bihar: మూడోరోజూ అదే తీరు
ABN , Publish Date - Jul 24 , 2025 | 03:49 AM
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు మూడో రోజు కూడా నిరసన కొనసాగించాయి. దీనిపై చర్చకు పట్టుబట్టిన విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలు జరగకుండా అడ్డు తగిలారు.

పార్లమెంట్‌లో కొనసాగిన విపక్షాల నిరసన
బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు
న్యూఢిల్లీ, జూలై 23: బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు మూడో రోజు కూడా నిరసన కొనసాగించాయి. దీనిపై చర్చకు పట్టుబట్టిన విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలు జరగకుండా అడ్డు తగిలారు. లోక్‌సభలో క్వశ్చన్ అవర్‌లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు. సభ్యులు ప్లకార్డులు పట్టుకోరాదని, వెళ్లి తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ ఓం బిర్లా కోరినా సభ్యులు వినిపించుకోలేదు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆందోళనలు సద్దుమణగకపోవడంతో ఉభయసభలూ తొలుత మధ్యాహ్నానికి, తర్వాత గురువారానికి వాయిదా పడ్డాయి.
అంతకు ముందు సభా కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ఇండియా బ్లాక్‌కు చెందిన పలు పార్టీల ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్ మకర ద్వారం బయట నిలబడి ఆందోళన చేపట్టారు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, డీఎంకేకు చెందిన టీఆర్ బాలు, శివసేన యూబీటీకి చెందిన సంజయ్ రౌత్, టీఎంసీకి చెందిన కల్యాణ్ బెనర్జీ పాల్గొన్నారు.