Share News

Kiren Rijiju On SIR: ఎస్ఐఆర్‌పై చర్చకు మాకు కొంత సమయం కావాలి

ABN , Publish Date - Dec 01 , 2025 | 08:21 PM

పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు రాజ్యసభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశాన్ని కూడా తాము తక్కువగా చూడటం లేదని చెప్పారు.

Kiren Rijiju On SIR: ఎస్ఐఆర్‌పై చర్చకు మాకు కొంత సమయం కావాలి
Kiran Rijiju

న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై చర్చ జరపాలని కోరుతున్న విపక్షాల డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చడం లేదని, ఆ ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiran Rijiju) చెప్పారు. ఎస్ఐఆర్, ఎన్నికల సంస్కరణలపై చర్చకు టైమ్‌లైన్ షరతు పెట్టవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజైన సోమవారంనాడు రాజ్యసభలో కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అఖిలపక్ష సమావేశంలో విపక్ష పార్టీలు తమ దృష్టికి తీసుకువచ్చిన ఏ అంశాన్ని కూడా తాము తక్కువగా చూడటం లేదని చెప్పారు.


'ఎస్ఐఆర్ అంశంపై చర్చను తోసిపుచ్చడం లేదు. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అయితే ఇవాళే చర్చ జరపాలని మీరు షరతు పెడితే కష్టం. ఎందుకంటే ప్రభుత్వం స్పందించేందుకు కొంత సమయం కావాలి' అని రిజిజు అన్నారు. ఎస్ఐఆర్, ఎన్నికల సంస్కరణల అంశంపై విపక్షాల డిమాండ్‌ను తాము తోసిపుచ్చడం లేదన్నారు. ఏ అంశాన్నీ చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని ఎవరూ ఊహించుకోవాల్సిన పని లేదని చెప్పారు.


దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాలని ఈసీఐ తీసుకున్న నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపడుతుండటంతో దీనిచుట్టూ వివాదం ముసురుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆదివారంనాడు నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కూడా ఎస్ఐఆర్ ప్రక్రియపై చర్చ జరగాలని ప్రతిపక్ష పార్టీలు కోరుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. లోక్‌సభలో మూడో పెద్ద పార్టీగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ సైతం ఇదే డిమాండ్ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆ పార్టీ ప్రకటించింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ సైతం ఎస్ఐఆర్‌పై చర్చ జరగాలని కోరుతోంది. ఎస్ఐఆర్ పని ఒత్తిడి కారణంగా పలువురు బూత్ స్థాయి అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ టీఎంసీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. తక్షణం ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలంటూ పలు పార్టీలు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించాయి. అయితే ఎస్ఐఆర్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని విపక్ష పార్టీలను ఈసీ కోరింది.


ఇవి కూడా చదవండి..

కాంగ్రెస్ కీలక సమావేశాలకు శశిధరూర్ గైర్హాజర్.. వరుసగా రెండోసారి

శునకంతో పార్లమెంటుకు.. వివాదంలో రేణుకా చౌదరి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 01 , 2025 | 08:23 PM