Share News

Omar Abdullah: కశ్మీర్‌లో ఢిల్లీ ఫలితాలు పునరావృతం కావు.. కేంద్రంపై ఒమర్ నిప్పులు

ABN , Publish Date - Jul 14 , 2025 | 07:02 PM

అమరవీరుల మెమోరియల్‌‌కు వెళ్లకుండా తనను, తన మంత్రివర్గ సహచరులను పోలీసులు అడ్డుకున్న షాకింగ్ విజువల్స్‌పై ఒమర్ మాట్లాడుతూ, తమకు ఏమి జరిగిందనేది ముఖ్యం కాదని, ప్రజాస్వామ్యం గురించి జమ్మూకశ్మీర్‌ ప్రజలకు వాళ్లు ఇచ్చిన సందేశం ఏమిటనేదే ఇక్కడ ముఖ్యమని అన్నారు.

Omar Abdullah: కశ్మీర్‌లో ఢిల్లీ ఫలితాలు పునరావృతం కావు.. కేంద్రంపై ఒమర్ నిప్పులు

శ్రీనగర్: 'అమర వీరుల దినోత్సవం' సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ విధించిన ఆంక్షల నడుపు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) 'మజర్ ఎ శుహాదా'కు వెళ్లడం, శ్మశానవాటిక గోడ దూకి లోపలికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనడం సంచలనమైంది. అనంతరం ఆయన కేంద్రంపై నిప్పులు చెరిగారు. ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు లేకుండా చేసి ఢిల్లీలో 'ఆప్' ను ఓడించినట్టు కశ్మీర్‌లోనూ కుదరుతుందనుకుంటే అది అసాధ్యమని లెఫ్టినెంట్ గవర్నర్‌, బీజేపీపై విమర్శలు గుప్పించారు.


అమరవీరుల మెమోరియల్‌‌కు వెళ్లకుండా తనను, తన మంత్రివర్గ సహచరులను పోలీసులు అడ్డుకున్న షాకింగ్ విజువల్స్‌పై ఒమర్ మాట్లాడుతూ, తమకు ఏమి జరిగిందనేది ముఖ్యం కాదని, ప్రజాస్వామ్యం గురించి జమ్మూకశ్మీర్‌ ప్రజలకు వాళ్లు ఇచ్చిన సందేశం ఏమిటనేదే ఇక్కడ ముఖ్యమని అన్నారు. ప్రజల వాణి, ఇష్టాఇష్టాలు, భావోద్వోగాలు, ఫీలింగ్స్ తమకు ఏమాత్రం పట్టవనే సందేశం ఇచ్చినట్టు దాదాపు స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యల ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది గ్రహించాలని కేంద్రాన్ని హెచ్చరించారు.


'రేపు మీరు ఎన్నికలు నిర్వహిస్తే 60 శాతానికి బదులు 20 శాతం ప్రజలు కూడా ఓటు వేయడానికి రాకపోవచ్చు. అప్పుడు మీరు ఎవరిని తప్పుపడతారు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వ్యవస్థలను గందరగోళంలో పడేయడం, వారిని అధికారం లేనివారిగా చిత్రీకరించడం ద్వారా ఢిల్లీ తరహా ఫలితాలు వస్తాయని మీరు ఆశించవద్దు' అని కేంద్రానికి హెచ్చరికలు చేశారు.


ఏమి జరిగినా మమ్మల్ని నిందించొద్దు

ఎన్నికైన ప్రభుత్వానికి ఎలాంటి అధికారులు లేకుండా చేస్తే కశ్మీర్ ప్రజలు బీజేపీని ఎన్నుకుంటారని ఆ పార్టీలో కొందరి అభిప్రాయంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఒమర్ తప్పుపట్టారు. అలా ఎప్పటికీ జరగదని, ప్రజలు ఎవరిని పడితే వారిని ఎన్నుకోరని అన్నారు. కేంద్రం ఇలాగే చేస్తూ పోతే ఆ తర్వాత తమను నిందించాల్సిన పని లేదన్నారు. కేంద్రం విజయవంతంగా ఒక ఎన్నిక నిర్వించిన తర్వాత తదుపరి ఎన్నికలు విజయవంతం కాకపోతే అందులో తమ బాధ్యత ఏమీ ఉండదన్నారు.


జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దయిన తర్వాత కేంద్రం తొలిసారిగా జరిపిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. దీంతో ఒమర్ అబ్దుల్లా గత ఏడాది అక్టోబర్‌లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అనంతరం ఒమర్ ప్రభుత్వం, కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ మధ్య సయోధ్య కూడా కనిపించింది. పహల్గాం ఘటన అనంతరం కేంద్రం తీసుకున్న చర్యలను ఒమర్ సమర్ధించారు.


నన్ను అడగొద్దు..

కేంద్రం, ఒమర్ ప్రభుత్వానికి మధ్య ఉన్న సయోధ్య తాజాగా 'అమర వీరుల దినోత్సవం' సందర్భంగా జరిగిన ఘటనల అనంతరం కూడా కొనసాగుతుందా అని ఒమర్‌ను ప్రశ్నించినప్పుడు ఆ మాట తనను కాదనని, ఇదంతా చేసిన వాళ్లను అడగండని ఆయన సమాధానమిచ్చారు. కశ్మీర్ నాయకులను నివాళులర్పించేందుకు అనుమతిస్తే అది 'నాన్-ఈవెంట్' కిందకే వచ్చేదని, కానీ స్థానిక యంత్రాంగం ఆంక్షలు విధించడం వల్లే ఆ పరిణామాలు పతాక శీర్షికలకు ఎక్కాయని అన్నారు.


ఇవి కూడా చదవండి..

గృహనిర్బంధం నడుమ.. గోడ దూకిన జమ్మూకశ్మీర్ సీఎం

నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 14 , 2025 | 07:04 PM