Share News

Love Revenge: పగబట్టిన పడుచు.. ప్రియుడు పెళ్లి చేసుకోలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది

ABN , Publish Date - Jun 24 , 2025 | 07:22 PM

పడచులు పగబడితే ఎలా ఉంటది.? ఇక, ప్రేమ కోసమైతే.. అదీ..ఒక రోబోటిక్స్ లేడీ టెకీ అయితే.. చెన్నైకి చెందిన 30 ఏళ్ల రెనే జోషిల్డా రివెంజ్ లవ్ స్టోరీ వింటే, రోజులు మారాయి టైటిల్ గుర్తుకు రావాల్సిందే. ఏకంగా పదకొండు రాష్ట్రాలు వణికిపోయాయి.

Love Revenge: పగబట్టిన పడుచు.. ప్రియుడు పెళ్లి చేసుకోలేదని 11 రాష్ట్రాల్ని వణికించింది
Woman Techie Rene Joshilda

ఇంటర్నెట్ డెస్క్: లేడీస్ కక్షకడితే.. అందులోనూ పడుచులు పగబడితే ఎలా ఉంటది.? అది ప్రేమ కోసమైతే ప్రతీకారం ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పకనే చెప్పింది ఒక రోబోటిక్స్ లేడీ టెకీ. చెన్నైకి చెందిన 30 ఏళ్ల రెనే జోషిల్డా రివెంజ్ లవ్ స్టోరీ వింటే, రోజులు మారాయి టైటిల్ గుర్తుకు రావాల్సిందే. అందునా ఒక తెలివైన టెకీ అమ్మాయి విలన్‌గా మారితే ఏకంగా పదకొండు రాష్ట్రాలు వణికిపోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక వివరాల్లోకి వెళ్తే, చెన్నైకి చెందిన 30 ఏళ్ల అమ్మాయి, రోబోటిక్స్ ఇంజనీర్ రెనే జోషిల్డా. ఈమె నకిలీ బాంబు బెదిరింపులు పంపడం ద్వారా దేశంలోని 11 రాష్ట్రాల్లో అలారం గంటలు మోగించింది. ఎందుకిదంతా అనుకుంటున్నారా.. ఆమె ప్రేమించిన వ్యక్తి.. ఆమెను పెళ్లి చేసుకోలేదన్న కోపంతో. తన ప్రేమికుడి పేరుతో నకిలీ ఇమెయిల్ IDలను సృష్టించి ఏకంగా 11 రాష్ట్రాలకు ఎంతో పగడ్బందీగా బెదిరింపు మెయిల్స్ పంపి హడలెత్తించింది.

అహ్మదాబాద్ పోలీసులు చెబుతున్న సమాచారం ప్రకారం, రెనే జోషిల్డా చెన్నైలో తన ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆపై రోబోటిక్స్‌లో కోర్సును అభ్యసించింది. ఆమె ప్రస్తుతం చెన్నైలోని ప్రఖ్యాత డెలాయిట్‌ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తోంది. బెంగళూరులో ఒక ప్రాజెక్ట్ సమయంలో, ఆమె దివిజ్ ప్రభాకర్‌ను అనే తన కొలిగ్ ప్రేమలో పడింది. అయితే, అది వన్ సైడ్ లవ్ గానే ఉంది. దివిజ్ ఎప్పుడూ రెనే భావాలను పట్టించుకోలేదు. అంతేకాదు, ఈ ఫిబ్రవరిలో వేరొకరిని వివాహం చేసుకున్నాడు కూడా. దీనితో రెనే కోపం కట్టలు తెంచుకుంది.

ఎలాగైనా తన ప్రియుడు దివిజ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టాలని భావించి అత్యంత భయంకర ప్రతీకారానికి కుట్ర పన్నింది. దివిజ్ పేరిట అనేక నకిలీ ఇమెయిల్ ఐడిలను సృష్టించింది. తద్వారా దివిజ్ ప్రభాకర్ పేరిట పలు స్కూల్స్, హాస్పిటల్స్, స్పోర్ట్స్ స్టేడియంలకు బాంబు బెదిరింపులు పంపడం ప్రారంభించింది. ఇందుకోసం VPNలు, నకిలీ ఇమెయిల్ IDలను ఉపయోగించింది.


ఇలా.. రెనే జోషిల్డా అహ్మదాబాద్ నగరంతోపాటు దాని చుట్టుపక్కల ఉన్న 21 ప్రదేశాలను పేల్చివేస్తానని బెదిరింపు మెయిల్స్ పంపింది. వీటిలో మోటెరాలోని నరేంద్ర మోడీ స్టేడియం, సర్ఖేజ్‌లోని జెనీవా లిబరల్ స్కూల్, ఒక సివిల్ హాస్పిటల్ ఉన్నాయని అహ్మదాబాద్ జాయింట్ CP (క్రైమ్) శరద్ సింఘాల్ మీడియాకు తెలిపారు.

ఇవే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ప్రజా ఊరేగింపులు, VVIP పర్యటనలు, వారి సందర్శనలకు ముందు మొత్తంగా 11 రాష్ట్రాలకు బెదిరింపు మెయిల్స్ పంపింది రెనే. వీటిలో మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, బీహార్, తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా ఉన్నాయి.

అంతేకాదు, జూన్ 12న, ఎయిర్ ఇండియా అహ్మదాబాద్-లండన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన సంగతి తెలిసిందే. టేకాఫ్ అయిన క్షణాల్లోనే ఈ విమానం BJ మెడికల్ కాలేజీ భవనాన్ని ఢీకొట్టింది. అయితే, ఈ ప్రమాదం తర్వాత, సదరు మెడికల్ కాలేజ్ అడ్మినిష్ట్రేషన్‌కు ఒక ఇమెయిల్ వచ్చింది. 'ఇప్పుడు నేనంటే ఏంటో తెలిసిందా' అంటూ అనేక బెదిరింపులతో కూడిన ఈ మెయిల్ దివిజ్ పేరిట పంపింది రెనే.

అహ్మదాబాద్ పోలీసుల చెబుతున్న దాని ప్రకారం, రెనే జోషిల్డా తన సాంకేతిక నైపుణ్యం కారణంగా, బెదిరింపు మెయిల్స్ పంపేటప్పుడు తన ట్రాక్‌లను ఎవరూ గుర్తించకుండా బాగా జాగ్రత్తలు తీసుకుంది. ఆమె టోర్ బ్రౌజర్ (సీక్రెట్ కమ్యూనికేషన్ కోసం ఒక నెట్‌వర్క్)ఇంకా, డార్క్ వెబ్ ద్వారా బెదిరింపు ఇమెయిల్‌లను పంపింది. ప్రతీ సారి చాలా తెలివిగా ప్రవర్తించి ఆమె డిజిటల్ అడ్రస్ దొరకకుండా జాగ్రత్తపడింది. కానీ ఆమె ఒక చిన్న తప్పు చేసింది. అదే ఆమెను పోలీసులు కనుగొనడానికి సాయపడింది. ఈ చిన్న ఆధారంతో సైబర్ క్రైమ్ వింగ్, క్రైమ్ బ్రాంచ్ ఆమెను ట్రాక్ చేసిందని సీపీ శరద్ సింఘాల్ చెప్పారు.

ఆరు నెలల క్రితం రెనే జోషిల్డా ఒక తప్పు చేసింది. ఆ ఒక్క తప్పు ఆమెను పట్టించింది. అపారమైన తెలివితేటలతో అనేక జాగ్రత్తలు తీసుకున్న రెనే ఒక సందర్భంలో ఒకే డివైజ్ నుంచి ఆమె నిజమైన, నకిలీ ఇమెయిల్ ఖాతాలలోకి లాగిన్ అయింది. దీంతో ఆమె IP అడ్రస్ దొరికేసింది. ఒక అజాగ్రత్త లాగిన్ ఆమెను పట్టించిందని పోలీసు అధికారి సింఘాల్ చెప్పారు.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో దారుణం.. కన్న కూతురుపై

రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్

ఏపీలో ప‌లు సంస్థ‌ల‌కు భూ కేటాయింపులకు అమోదం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 24 , 2025 | 07:22 PM