Mallikarjun Kharge: నితీష్‌ది కుర్చీల గోల.. వారిది అవకాశవాద కూటమి: ఖర్గే
ABN , Publish Date - Apr 20 , 2025 | 05:48 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది క్రితం ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఖర్గే నిలదీశారు. 2015 ఆగస్టు 15న బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని ప్రధాన మంత్రి ప్రకటించారని, ఆ సంగతేమిటని నితీష్ కుమార్‌ను రాష్ట్ర ప్రజలు నిలదీయలని పేర్కొన్నారు.

బక్సర్: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) కేవలం కుర్చీ కోసమే పార్టీలు మారుతుంటారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. రాష్ట్రంలో జేడీయూ-బీజేపీ కూటమిని 'అవకాశవాద' కూటమిగా పేర్కొన్నారు. బక్సర్‌లోని దాల్‌సాగర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్'' ర్యాలీలో ఖర్గే ఆదివారంనాడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది చివర్లో బీహార్‌లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Compulsory Hindi Move: మహా సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భాషా ప్యానల్
''నితీష్ కుమార్, బీజేపీ మధ్య పొత్తు అవకాశవాద పొత్తు. ఇది రాష్ట్ర ప్రజలకు మేలు చేసేది కాదు. నితీష్ కుమార్ కేవలం కుర్చీ (సీఎం సీటు)కోసమే పార్టీలు మారుతుంటారు. మహాత్మాగాంధీ హంతకుల ఐడియాలజీ కలిగిన వారితో ఆయన చేతులు కలిపారు'' అని ఖర్గే విమర్శించారు.
ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాలను ఆయన ప్రస్తావిస్తూ, అభివృద్ధి అంశాలపై కంటే విభజన అంశాలపైనే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించిందని చెప్పారు. పార్లమెంటు సెషన్‌లో ఎక్కువ సమయం వక్ఫ్ బిల్లుపై చర్చతోనే నడిచిందన్నారు. హిందువులు, ముస్లింల గురించి మాట్లాడి ప్రజలను తప్పదారి పట్టిస్తే ఓట్లు పడతాయనే అభిప్రాయంతో మోదీ, బీజేపీ నేతలు ఉంటారని, ఇక పనిచేయాల్సిన అవసరం ఏముందని ఖర్గే ప్రశ్నించారు.
మోదీ ఇస్తామన్న ఆర్థిక ప్యాకేజీ ఏమైంది?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది క్రితం ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఖర్గే నిలదీశారు. ''2015 ఆగస్టు 15న బీహార్‌కు రూ.1.25 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ఇస్తామని ప్రధాన మంత్రి ప్రకటించారు. ఆ సంగతేమిటని నితీష్ కుమార్‌ను రాష్ట్ర ప్రజలు నిలదీయాలి. మోదీ అబద్ధాల ఫ్యాక్టరీ నడుపుతున్నారు'' అని ఖర్గే విమర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను సభికులకు చూపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి ప్రజలు ఓటు వేయాలని కోరుతూ ఖర్గే తన ప్రసంగాన్ని ముగించారు.
నేషనల్ హెరాల్డ్ కేసుపై..
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల ఛార్జిషీటు నమోదు చేయడాన్ని కూడా ఖర్గే ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా టార్గెట్ చేసేందుకే ఇలా చేశారని, తమ నాయకులు వీటికి బెదిరిపోదని, దేశం కోసం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తన ప్రాణాలను అర్పించారని అన్నారు. పేదలకు బీజేపీ, ఆర్ఎస్‌ఎస్ వ్యతిరేకమని, మెరుగైన సమాజం కోసం వారెప్పుడూ ఆలోచించరని, కులం, మతం పేరుతో సమాజాన్ని విడగొట్టాలని చూస్తాయని విమర్శించారు. వక్ఫ్ బిల్లును ఆమోదించడం వెనుక మతపరమైన విభజనలు సృష్టించే కుట్ర ఉందని ఖర్గే ఆరోపించారు.
ఇవి కూడా చదవండి..