Nitin Gadkari: 11 ఏళ్లు న్యూస్‌రీల్ మాత్రమే అసలు సినిమా ముందుంది
ABN , Publish Date - Jun 22 , 2025 | 06:15 AM
నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పాలనపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్లు, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘11 ఏళ్లలో మీరు చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమే.

కేంద్రమంత్రి గడ్కరీ నర్మగర్భ వ్యాఖ్యలు
నాగ్‌పూర్, జూన్ 21: నరేంద్రమోదీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు పాలనపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్లు, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘11 ఏళ్లలో మీరు చూసింది కేవలం న్యూస్ రీల్ మాత్రమే. అసలు సినిమా ముందుంది’ అని ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తానని గడ్కరీ చెప్పారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తానని చెప్పారు. తానెప్పుడూ తన రాజకీయ బయోడేటా ప్రచురించుకోలేదని, ఏనాడూ విమానాశ్రయాలకు వచ్చి భారీగా స్వాగత కార్యక్రమాలు చేపట్టాలని తన మద్దతు దారులనూ కోరలేదని గడ్కరీ తెలిపారు.
విదర్భలో అన్నదాతల ఆత్మహత్యలను నిలువరించాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ‘రోడ్ల పనుల కంటే ప్రస్తుతం నేను వ్యవసాయం, ఇతర సామాజిక అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. అధిక జనాభా వల్లే వ్యక్తిగత తలసరి ఆదాయంలో భారత్.. టాప్-10 దేశాల జాబితాలో చోటు దక్కించుకోలేదని చెప్పారు. జనాభా నియంత్రణ బిల్లుకే తన మద్దతు ఉంటుందని గడ్కరీ తెలిపారు. ‘ఇది మత పరమైన. భాషా పరమైన సమస్య కాదు. ఇది ఒక ఆర్థిక సమస్య. దేశంలో ఎంతో అభివృద్ధి సాధించినా.. దాని ఫలాలు కనిపించడం లేదు. దీనికి జనాభా పెరుగుదలే కారణం’ అని చెప్పారు. శివసేన (యూబీటీ) నాయకుడు సుధాకర్ బాద్ఘుజార్.. బీజేపీలో చేరనున్నారా? అన్న ప్రశ్నపై గడ్కరీ స్పందిస్తూ.. ఆయనెవరో తనకు తెలియదన్నారు.