భారత ఎగుమతిదారుల ప్రయోజనాలు కాపాడతాం
ABN , Publish Date - Mar 07 , 2025 | 05:30 AM
అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంపై పెద్దఎత్తున సుంకాలు విధిస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇక్కడి ఎగుమతిదారుల ప్ర యోజనాలు కాపాడేందుకు యత్నిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

అన్నింటికీ పన్నులు కడుతున్నామంటే కారణాలు ఉన్నాయ్: నిర్మలా సీతారామన్
విశాఖపట్నం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశంపై పెద్దఎత్తున సుంకాలు విధిస్తామని ప్రకటిస్తున్న నేపథ్యంలో ఇక్కడి ఎగుమతిదారుల ప్ర యోజనాలు కాపాడేందుకు యత్నిస్తున్నామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇందులో భాగంగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ అమెరికాకు వెళ్లి చర్చలు జరుపుతున్నారని తెలిపారు. విశాఖపట్నంలో గురువారం వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, చార్టెడ్ అకౌంటెంట్లతో ఆమె సమావేశమయ్యారు.
వేర్వేరు ప్రయోజనాల కోసమే పన్నులు
ఒక కారును రూ.12 లక్షలు పెట్టి కొంటే జీఎస్టీ, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ ట్యాక్స్.. ఇలా సుమారు మరో రూ.10 లక్షలు అదనంగా పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తోందని, ఇది న్యాయమా అని ఒకరు ప్రశ్నించగా మంత్రి దానికి సవివరంగా సమాధానమిచ్చారు. సాధారణ పౌరుల దృష్టిలో అది పన్నుల భారంగానే కనిపిస్తుందని, కానీ అవన్నీ వేర్వేరు అవసరాల కోసం చెల్లిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. తయారుచేసిన కారు కొన్నందుకు జీఎ స్టీ, రహదారిపై ఆ వాహనం నడుపుతున్నందుకు ఆ రోడ్డు నిర్మాణానికి అయిన ఖర్చు కోసం పన్ను, పెట్రోల్ పోయించుకుంటే దానిని దిగుమతి చేసుకున్నందుకు పన్ను, ఇలా అన్ని వేర్వేరు ప్రయోజనాల కోసం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ కారు కొన్నవారు, రోడ్డును ఉపయోగించుకునేవారు, పెట్రోల్ కొనేవారు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ప్రజలకు ఏ సదుపాయమూ ఊరకనే రాదని తెలుసుకోవాలన్నారు. న్యూజెర్సీ వంటి రహదారులు, అమెరికా వంటి విమానాశ్రయాలు కావాలంటే భారీగా నిధులు వెచ్చించాలని, వాటిని రాబట్టుకోవడానికే ప్రభుత్వం పన్నులు వేస్తుందన్నారు.
3 కోట్ల మందే పన్ను చెల్లింపుదారులు
దేశంలో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు 9 కోట్ల మంది ఉంటే వారిలో కేవలం 3 కోట్ల మంది మాత్ర మే పన్ను చెల్లింపుదారులు ఉన్నారని కేంద్ర మంత్రి వివరించారు. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ అని రెండు రకాలు వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారని, రెండింటిని కలిపి ఒకటిగానే వసూలు చేయవచ్చు కదా అని ఒకరు ప్రశ్నించగా, అది ఫెడరల్ విధానంలో భాగమని ఆమె సమాధానమిచ్చారు.