Share News

Nepal PM Oli : రాముడు నేపాల్‌లోనే పుట్టాడు

ABN , Publish Date - Jul 09 , 2025 | 02:36 AM

శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ భగవానుడు నేపాల్‌లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు.

Nepal PM Oli : రాముడు నేపాల్‌లోనే పుట్టాడు

  • శివుడు, విశ్వామిత్రుడు కూడా ఇక్కడే జన్మించారు

  • నేపాల్‌ ప్రధాని ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు

కాఠ్‌మాండూ, జులై 8: శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ భగవానుడు నేపాల్‌లోనే జన్మించాడని పునరుద్ఘాటించారు. రాముడితోపాటు శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్‌లోనే పుట్టారని చెప్పారు. కాఠ్‌మాండూలో అధికార సీపీఎన్‌-యూఎంఎల్‌ పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఓలి ఈ వ్యాఖ్యలు చేశారు. రాముడు నేపాల్‌లోనే జన్మించాడని.. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే తాను ఈ మాట చెబుతున్నానని ఓలి అన్నారు. ‘‘రాముడు పుట్టిన స్థలం నేపాల్‌లోనే ఉంది. దీన్ని మనం అంతగా జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నాం’’ అని చెప్పారు. రాముడు పుట్టింది నేపాల్‌లో అయితే.. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరు? అని ఓలి ప్రశ్నించారు. ఓలి గతంలోనూ ఇలాంటి వివాదాస్పద ప్రకటనలే చేశారు. అయోధ్య నేపాల్‌లోని చిత్వాన్‌ జిల్లా థోరిలో ఉందని 2020 జూలైలో చెప్పారు. ఇక్కడే రాముడు పుట్టాడనీ అన్నారు. అక్కడ రామ మందిరం నిర్మించాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన ప్రాంతం కూడా నేపాల్‌లోనే ఉందన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 08:52 AM