NCERT Revises: అక్బర్ పాలనలో మత అసహనం
ABN , Publish Date - Jul 17 , 2025 | 06:22 AM
ఎనిమిదో తరగతి విద్యార్థులకు బోధించే సాంఘిక శాస్త్రంలో ‘ఎన్‌సీఈఆర్‌టీ’ కీలకమార్పులు చేసింది.

పుర్రెలపై విజయ సౌధాలు కట్టిన బాబర్
8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యాంశంలో ఎన్‌సీఈఆర్టీ మార్పులు
న్యూఢిల్లీ, జూలై 16: ఎనిమిదో తరగతి విద్యార్థులకు బోధించే సాంఘిక శాస్త్రంలో ‘ఎన్‌సీఈఆర్‌టీ’ కీలకమార్పులు చేసింది. భారతదేశాన్ని 13 నుంచి 17వ శతాబ్దంవరకు పాలించిన ఢిల్లీ సుల్తానులు, విజయనగర రాజులు, మొఘల్ చక్రవర్తులు, మరాఠాలు, సిక్కు రాజుల చరిత్రలకు సంబంధించి, గతంలో చేర్చని పలు అంశాలను కొత్త పాఠ్యాంశంలో భాగం చేసింది. అక్బర్ పాలన మత అసహనంతో సాగిందని, మరో మొఘల్ చక్రవర్తి బాబర్.. శత్రు సేనలను వధించి, వారి పుర్రెలపై విజయ సౌధాలు నిర్మించారని పేర్కొన్నారు. చిత్తోర్‌కోటను జయించినప్పుడు వేలాదిమందిని అక్బర్ వధించారని తెలిపారు. ఈ సందర్భంగా అక్బర్ తన సన్నిహితులతో మాట్లాడుతూ... ‘‘అవిశ్వాసులకు చెందిన పలు కోటలు, నగరాలు జయించాం. ఇస్లామ్ రాజ్యాన్ని వ్యాపింపజేశాం’’ అని అన్నట్టు రాశారు. ‘భారతదేశ రాజకీయ పటాన్ని తిరగరాసిన శతాబ్దాలు’ అనే శీర్షికతో ఇలాంటి అంశాలెన్నో పొందుపరిచారు. గతంలో జరిగిపోయిన ఘటనలకు ఎవరినీ బాధ్యులను చేయలేం.. అని ఒక అధ్యాయంలో ‘ఎన్‌సీఈఆర్‌టీ’ పేర్కొంది. అలాగే.. ‘చరిత్రలో కొన్ని చీకటి ఘట్టాలు’ అనే పేరిట రాసిన ఉపోద్ఘాతంలో ఎందుకు సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాన్ని సవరించాల్సి వచ్చిందో వివరించింది. శ్రీరంగం, చిదంబరం సహా పలు హిందూ ధార్మిక స్థలాలను అల్లావుద్దీన్ ఖిల్జీ దళవాయి మాలిక్ కఫూర్ నాశనం చేశాడని ఎన్‌సీఈఆర్టీ పుస్తకంలో వివరించింది.