Sonia Gandhi: సోనియా నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ
ABN , Publish Date - Nov 30 , 2025 | 07:20 PM
ఢిల్లీలోని సోనియా నివాసంలో కాంగ్రెస్ పెద్దలు భేటీ అయ్యారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగబోతోన్న తరుణంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలు చర్చించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 30: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి (డిసెంబర్ 1) ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని ఖరారు చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ రాత్రి (ఆదివారం) కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం, లోక్‌సభ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్, చీఫ్ విప్ కోడికున్నిల్ సురేష్ తదితర సీనియర్ ఎంపీలు హాజరయ్యారు.
సమావేశంలో రేపటి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సెషన్‌లో ప్రభుత్వాన్ని నిలదీసే వ్యూహం, సభలో లేవనెత్తాల్సిన కీలక అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎలా బయటపెట్టాలి అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ధరల పెరుగుదల, నిరుద్యోగం, అదానీ-హిండెన్‌బర్గ్ ఆరోపణలు, మణిపూర్ హింస వంటి అంశాలను లోక్‌సభ, రాజ్యసభలో గట్టిగా లేవనెత్తాలని నేతలు నిర్ణయించినట్లు సమాచారం.
గత కొన్ని సెషన్లుగా ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, ఈసారి దాన్ని అడ్డుకునేలా ఐక్యంగా పోరాడాలని సోనియా గాంధీ సూచించినట్లు తెలియవచ్చింది. బీహార్ లో ఘోర ఓటమి నేపథ్యంలో మొత్తం మీద ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
బీఎల్ఓల పరిహారం రెట్టింపు.. ఈసీ నిర్ణయం
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిల పక్షం భేటీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి