Share News

NISAR Satellite Launch: రేపే నింగిలోకి నిసార్‌

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:44 AM

నాసా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్‌ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది.

NISAR Satellite Launch: రేపే నింగిలోకి నిసార్‌

సూళ్లూరుపేట, జూలై 28(ఆంధ్రజ్యోతి): నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్‌ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టనుంది. ఈ రాకెట్‌ ద్వారా బుధవారం సాయంత్రం ‘నాసా-ఇస్రో సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌’ (నిసార్‌) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. ఈ ప్రయోగానికి కౌంట్‌ డౌన్‌ను మంగళవారం మధ్నాహ్నం 2:10 గంటలకు ప్రారంభించి.. 27:30 గంటలపాటు కొనసాగించనున్నారు. ఆ తర్వాత షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 5:40 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ వి.నారాయణన్‌ సోమవారం షార్‌కు చేరుకుని ప్రయోగ సన్నాహాల్లో పాల్గొన్నారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరు, తదితర అంశాలపై చర్చించిన అనంతరం ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం కావడంతో అమెరికా శాస్త్రవేత్తలు కూడా షార్‌కు చేరుకున్నారు.

భూ పరిశీలన, విపత్తుల అంచనా..

నిసార్‌ ఉపగ్రహం మొత్తం 12 రోజుల్లో భూమిని మ్యాప్‌ చేయగలదని ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ అన్నారు. వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను ముందుగానే అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. ‘నిసార్‌ ఉపగ్రహంలో ఎస్‌ బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశాం. ఎల్‌ బ్యాండ్‌ సింథటిక్‌ అపెర్చర్‌ను నాసా రూపొందించింది. నిసార్‌ ఉపగ్రహం మేఘాలు ఆవరించినా, వర్షం కురిసినా, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలూ స్పష్టమైన ఫొటోలు తీసి భూమికి పంపగలదు. మట్టి పెళ్లలు విరిగిపడటం, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి అప్రమత్తం చేయగలదు. పంటల పెరుగుదల, నీటి వినియోగ సమాచారం కూడా అందించగలదు. ప్రతి 12 రోజులకోసారి భూమిని చుట్టి స్పష్టమైన ఫొటోలు పంపిస్తుంది’ అని నారాయణన్‌ వివరించారు.


ఇవి కూడా చదవండి..

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:45 AM