Trump Administration: నాసాలో 4 వేల మంది ఉద్యోగులకు వీఆర్‌ఎస్!
ABN , Publish Date - Jul 27 , 2025 | 05:30 AM
సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లి పరిశోధనలు చేస్తున్న పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి 25వేల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి సౌర కుటుంబం అంచులనూ దాటి ముందుకెళ్తున్న వోయేజర్-1 వ్యోమనౌక దాకా అద్భుత పరిశోధనలకు నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) పెట్టింది పేరు.

ప్రభుత్వ వ్యయం తగ్గింపు కోసం ట్రంప్ యంత్రాంగం చర్యల ఫలితం
ముందస్తు రిటైర్మెంట్ కోసం ఒత్తిళ్లు
నాసా బడ్జెట్‌లో ఇప్పటికే 24% కోత
ఆందోళన వ్యక్తం చేస్తున్న శాస్త్రవేత్తలు
వాషింగ్టన్, జూలై 26: సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లి పరిశోధనలు చేస్తున్న పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి 25వేల కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి సౌర కుటుంబం అంచులనూ దాటి ముందుకెళ్తున్న వోయేజర్-1 వ్యోమనౌక దాకా అద్భుత పరిశోధనలకు నాసా (అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ) పెట్టింది పేరు. అలాంటి నాసా ఇప్పుడు వట్టిపోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ వ్యయం తగ్గించడం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం చేపట్టిన చర్యలు నాసాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బడ్జెట్‌లో నాసాకు 24 శాతం నిధులు తగ్గించడం, దానికితోడు సైంటిఫిక్ రీసెర్చ్ విభాగానికి నిధులు సగానికి సగం కోసేయడం నేపథ్యంలో.. కొందరు ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణ కోసం ఒత్తిడి చేయడం మొదలైంది. ‘వాలంటరీ ఎర్లీ రిటైర్మెంట్ అథారిటీ’ కింద 870 మంది.
‘వాలంటరీ సెపరేషన్ ఇన్సెంటివ్ ప్రొగ్రామ్’ కింద 3 వేల మందికిపైగా నాసా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్టు నాసా న్యూస్ విభాగం చీఫ్ చెరీల్ వార్నర్ తాజాగా వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన జనవరి నుంచి జూన్ చివరి వరకు సుమారు 500 మంది ఉద్యోగులు నాసాను వీడారని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నాటికి నాసా ఉద్యోగుల సంఖ్య 20శాతం మేర తగ్గి 14 వేల లోపునకు తగ్గిపోతుందని అంచనా వేశారు. ట్రంప్ యంత్రాంగం చర్యలతో నాసా శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2003లో కొలంబియా స్పేస్ షటిల్ పేలిపోయిన ఘటనను గుర్తుచేస్తూ.. వ్యయం తగ్గింపుతో భద్రతా ప్రమాణాలపై రాజీ పడాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వ చర్యలతో పరిశోధనలకు విఘాతం కలగడం నుంచి వ్యోమగాముల భద్రత ప్రమాదంలో పడటం వరకు జరగబోయే పరిణామాలను ప్రస్తావిస్తూ రూపొందించిన ‘వోయేజర్ డిక్లరేషన్’పై 362 మంది నాసా ప్రస్తుత, పూర్వ శాస్త్రవేత్తలు సంతకాలు చేసి.. నాసా చీఫ్‌కు పంపారు.
ఈవార్తలు కూడా చదవండి..
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు..
సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌లో ఘోర తప్పిదం.. పోలీసుల కేసు నమోదు
Read latest Telangana News And Telugu News