PM Modi: బిహార్ గెలుపును సాకారం చేసిన MY ఫార్ములా
ABN , Publish Date - Nov 15 , 2025 | 07:29 PM
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై పరోక్షంగా మోదీ విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తామని ఒక నేత ప్రకటించారని, అయితే ప్రజలు వారి విభజన రాజకీయాలను పూర్తిగా తోసిపుచ్చారని చెప్పారు.
సూరత్: కులాల పేరుతో విషం చిమ్మిన పార్టీలను బీహార్ ప్రజలు తిప్పికొట్టారని, మహిళలు, యువత అనే కొత్త 'MY' కలయిక బిహార్‌లో ఎన్డీయే విజయాన్ని సుస్ధిరం చేసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. గుజరాత్‌లోని సూరత్‌లో శనివారంనాడు జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై పరోక్షంగా మోదీ విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని చెత్తబుట్టలో పడేస్తామని ఒక నేత ప్రకటించారని, అయితే ప్రజలు వారి విభజన రాజకీయాలను పూర్తిగా తోసిపుచ్చారని చెప్పారు. శతాబ్ద కాలంలో ఎన్నికల పనితీరుపై కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. ఎన్డీయే, మహాగఠ్‌బంధన్ మధ్య ఓట్ షేర్ తాడా కేవలం 10 శాతమేనని, అయితే చాలా కీలకమని అన్నారు. దానిని బట్టి సగటు బిహార్ ఓటరు అభివృద్ధికే పట్టం కట్టారనేది స్పష్టమవుతుందని వివరించారు.
'ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బిహార్ పేరు వినిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా బిహారీల ప్రతిభ కనపిస్తోంది. అభివృద్ధిలో సరికొత్త పుంతలు తొక్కాలని బిహార్ కోరుకుంటోంది. ప్రజాభిమతాన్నే ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించాయి' అని ప్రధాని అన్నారు. రాబోయే కాలంలో బిహార్ రాజకీయ పునాదులను మహిళలు, యువత కలిసి పటిష్టం చేయనున్నాయని చెప్పారు.
బీహార్ ఎన్నికల్లో అధికార ఎన్డీయే 202 సీట్లతో ఘనవిజయం సాధించింది. కూటమిలోని బీజేపీ 89 సీట్లు గెలుచుకోగా, జేడీయూ 84, ఎల్‌జేపీ (రామ్‌విలాస్) 10, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 సీట్లు గెలుచుకున్నాయి. విపక్ష మహాకూటమిలోని ఆర్జేడీ 25 సీట్లకు పరిమితం కాగా, కాంగ్రెస్ 6 సీట్లు గెలుచుకుంది. సీపీఐఎంఎల్ 2, సీపీఎం 1, ఐఐపీ 1 సీటులో గెలుపొందాయి. సొంతంగా పోటీ చేసిన ఏఐఎంఐఎం-5, బీఎస్‌పీ-1 సీటు గెలుచుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
రాజకీయాలకు గుడ్‌బై.. లాలూ కుమార్తె సంచలన ప్రకటన
ఓటమితో విచారం, విజయంతో అహంకారం ఉండదు.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.