Share News

Kerala: ముసాఫిర్‌, సమీర్‌ నా ప్రాణాలు కాపాడారు

ABN , Publish Date - Apr 26 , 2025 | 03:14 AM

పెహల్గామ్‌ ఉగ్రదాడిలో తండ్రిని కోల్పోయిన ఆరతి మేనన్‌కు, కశ్మీరీ ట్యాక్సీ డ్రైవర్లు ముసాఫిర్‌, సమీర్‌ సోదరుల్లా తోడుగా నిలిచి, ఆమెకు అత్యంత విషాద సమయంలో అండగా ఉండారు

Kerala: ముసాఫిర్‌, సమీర్‌ నా ప్రాణాలు కాపాడారు

కొచ్చి, ఏప్రిల్‌ 25: ఆమె కేరళకు చెందిన మహిళ. పేరు ఆరతి మేనన్‌! ప్రస్తుతం తనకు కశ్మీర్‌లో ముసాఫిర్‌, సమీర్‌ అనే సోదరులు ఉన్నారని ఆమె చెబుతోంది. ఆరతి కూడా పెహల్గామ్‌ ఉగ్రదాడి బాధితురాలు. ఆరేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు, తల్లిదండ్రులతో కలిసి బైసారన్‌కొచ్చింది. తల్లి షీలా మాత్రం దూరంగా కార్లో కూర్చుంటే మిగతావారంతా అక్కడ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ గుర్రపు స్వారీ చేస్తున్నారు. అయితే ఆరతి కళ్లెదుటే తండ్రి, 65 ఏళ్ల రామచంద్రన్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. పిల్లలను తీసుకొని భయంతో తాను దారితెన్నూ లేకుండా అడవులవైపు పరుగెత్తి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నానని చెప్పింది. ఇంతటి విషాద సమయంలో తనకు ఏమాత్రం పరిచయం లేకున్నా ముసాఫిర్‌, సమీర్‌ అనే ఇద్దరు కశ్మీరీ ట్యాక్సీ డ్రైవర్లు ఓ సోదరిలా భావించి ఎంతో సాయం చేసి, అండగా నిలిచారని ఆరతి చెప్పింది. తన వెంట ఇద్దరూ కలిసి మార్చురీ దాకా వచ్చారని.. లాంఛనాలన్నీ పూర్తయ్యేదాకా దగ్గరుండి అన్నీ చూసుకున్నారని.. ఎయిర్‌పోర్టు దాకా కూడా వచ్చారని ఆమె వివరించింది. తనకు ముసాఫిర్‌, సమీర్‌ ఇద్దరూ సోదరులని.. వారిని అల్లా ఎప్పుడూ కాపాడాలని ఆరతి భావోద్వేగానికి గురైంది.

Updated Date - Apr 26 , 2025 | 03:14 AM