Siddaramaiah Death Fake News: సిద్దరామయ్య మరణించారట
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:42 AM
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరణించారట. ఓ సంతాప సందేశాన్ని తప్పుగా అనువదించడం ద్వారా..

అనువాదంలో మెటా పొరబాటు
కర్ణాటక సీఎం ఆగ్రహం
క్షమాపణలు చెప్పిన సంస్థ
బెంగళూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మరణించారట. ఓ సంతాప సందేశాన్ని తప్పుగా అనువదించడం ద్వారా ‘మెటా’ సంస్థ సృష్టించిన కలకలమిది. సోషల్ మీడియా వేదికగా మెటా చేసిన తప్పును చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఆ సంస్థపై సిద్దరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే.. ఇటీవల సీనియర్ నటి బి.సరోజాదేవి కన్నుమూసిన సందర్భంగా సంతాపం తెలుపుతూ సీఎం కార్యాలయం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సందేశం పెట్టింది. అయితే కన్నడ భాషలో ఉన్న ఆ సందేశాన్ని మెటా ఆటోమేటిక్ ట్రాన్స్‌లేషన్ టూల్ ఇంగ్లి్‌షలోకి ‘‘చీఫ్ మినిస్టర్ సిద్దరామయ్య నిన్న కన్నుమూశారు. సరోజాదేవి పార్ధివదేహానికి నివాళులు అర్పించారు’’ అంటూ తప్పుగా అనువదించింది. దీన్ని గమనించిన సిద్దరామయ్య అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిపై సిద్దరామయ్య స్పందిస్తూ.. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కచ్చితంగా అనువదించే వరకు కన్నడ ఆటో ట్రాన్స్‌లేషన్‌ను నిలిపివేయాలని మెటాపై మండిపడ్డారు. మెటా చేసిన పొరపాటుతో ప్రజలకు తప్పుడు సందేశం వెళ్లిందన్నారు. కన్నడ విశిష్ఠతకు భంగం కలిగేలా అనువదించడం సరికాదన్నారు. ఏదైనా అధికారిక సమాచారం విషయంలో ఇలాంటి అనువాదం చాలా ప్రమాదకమన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు అధికారికంగా తన మీడియా సలహాదారు లేఖ రాశారని ఎక్స్‌లో తెలిపారు. ఆ లేఖను కూడా పోస్టు చేశారు. కన్నడ భాషా నిపుణుల చేత తర్జుమా చేయించాలని ఆ లేఖలో సూచించారు. తరచుగా తప్పులు దొర్లే ఇలాంటి తర్జుమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. తన తప్పు తెలుసుకున్న మెటా సంస్థ క్షమాపణలు కోరింది. పొరపాట్లను పునరావృతం కానివ్వబోమని హామీ ఇచ్చింది. ఆ సంస్థ అధికార ప్రతినిధి పీటీఐతో మాట్లాడుతూ, అనువాదంలో తప్పును సరిచేశామని, జరిగినదానికి క్షమాపణ చెబుతున్నామని అన్నారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి