AI Supercluster: మెటా ఏఐ.. మెగా ప్లాన్
ABN , Publish Date - Jul 17 , 2025 | 05:43 AM
ఏఐ’ రంగంలో ఇప్పటికే దూసుకుపోతున్న ఓపెన్ ఏఐ, డీప్‌సీక్ వంటివాటికి మరింత గట్టిపోటీ ఇచ్చేందుకు.. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో జుకెర్‌బెర్గ్ భారీ ప్రణాళికలు రచించారు..

రూ.లక్షల కోట్ల వ్యయంతో ఏఐ సూపర్ క్లస్టర్లు.. 1341 మెగావాట్ల సామర్థ్యంతో తొలి క్లస్టర్ ప్రొమెథియస్
వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి: మార్క్ జుకెర్‌బెర్గ్
తర్వాత మరిన్ని క్లస్టర్లు.. 5గిగావాట్లతో హైపరియన్ క్లస్టర్
ఓపెన్ ఏఐ, యాపిల్, ఆంత్రోపిక్ వంటి పెద్ద సంస్థల నుంచి ప్రతిభావంతులకు వల
నియామకాల కోసం స్కేల్ ఏఐతో రూ.1.2 లక్షల కోట్ల ఒప్పందం
‘ఏఐ’ రంగంలో ఇప్పటికే దూసుకుపోతున్న ఓపెన్ ఏఐ, డీప్‌సీక్ వంటివాటికి మరింత గట్టిపోటీ ఇచ్చేందుకు.. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో జుకెర్‌బెర్గ్ భారీ ప్రణాళికలు రచించారు! రూ.లక్షల కోట్ల ఖర్చుతో భారీ ‘ఏఐ’ సూపర్‌క్లస్టర్ల నిర్మాణానికి నడుం బిగించారు!! ‘ప్రొమెథియస్’ పేరుతో.. వచ్చే ఏడాది నాటికి 1341 మెగావాట్ల ఏఐ సూపర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా ఆ శక్తిని పెంచుకుంటూ పోయి కొన్నేళ్ల తర్వాత 5 వేల గిగావాట్ల ‘హైపరియన్’ సూపర్‌క్లస్టర్‌ను నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఇంతకీ ఏమిటీ సూపర్ క్లస్టర్లు? వీటివల్ల ఉపయోగం ఏంటి? అంటే.. కృత్రిమ మేధ ఎలా పనిచేస్తుందో ముందు తెలుసుకోవాలి. సాధారణంగా మనం గూగుల్‌లో ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే.. సెర్చ్ చేసి, వచ్చిన సమాచారాన్నంతటినీ ఒక్కొక్కటిగా స్ర్కోల్ చేసి, పనికొచ్చే డేటాను తీసుకుని దాన్ని క్రోడీకరిస్తేగానీ మన పని పూర్తి కాదు. ఇంత పనినీ చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి ఏఐలు కన్నుమూసి తెరిచేంతలో పూర్తిచేస్తున్న విషయం తెలిసిందే కదా! అవి అంత వేగంగా సమాచారాన్ని సేకరించడం వెనుక అసలు కిటుకు.. ఈ సూపర్ క్లస్టర్లే. ఇవి నేరుగా సమాచారాన్ని సేకరించడంలో ఉపయోగపడవుగానీ.. ఎలా సేకరించాలో ఏఐ మోడల్స్‌కు రోజులు, వారాలు, నెలల తరబడి శిక్షణ ఇస్తాయి. ఇంత శిక్షణ ఇవ్వడం మనుషులకు సాధ్యం కాదు కాబట్టి ఈ సూపర్ క్లస్టర్లను వినియోగిస్తారు. అలా.. డీప్‌సీక్ ఏఐ మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తున్న సూపర్ క్లస్టర్ సామర్థ్యం ఎంతో తెలుసా? కేవలం 12 నుంచి 14 మెగావాట్లు. చాట్‌జీపీటీకి శిక్షణ ఇవ్వడానికి ఉపయోగిస్తున్న సూపర్ క్లస్టర్ సామర్థ్యం 300 నుంచి 500 మెగావాట్లు! దానికి దాదాపు రెండున్నర రెట్ల అధిక సామర్థ్యంతో.. ఏకంగా 1341 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్లస్టర్ ఏర్పాటుకు మెటా సిద్ధమవుతోందంటే అది ఎంత శక్తిమంతమైనదో అర్థం చేసుకోవచ్చు. అందునా అది ఆరంభం మాత్రమే. మెటా ప్రణాళికలో తుది ప్రాజెక్టు.. అక్షరాలా 5 గిగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్లస్టర్ నిర్మాణం. అంటే ‘ప్రొమెథియస్’ కన్నా.. దాదాపు ఐదు రెట్ల అధిక సామర్థ్యం. అందుకే టెక్ ప్రపంచమంతా ఈ ప్రాజెక్టువైపు ఆసక్తిగా చూస్తోంది.
ఉద్యోగావకాశాలూ..
ఈ భారీ ప్రాజెక్టు కోసం భారీగా పెట్టుబడులు పెట్టడంపైనే కాదు.. అంతే భారీస్థాయిలో ఏఐ రంగంలో ప్రతిభావంతులను నియమించుకోవడంపైనా మెటా దృష్టి సారించింది. నియామకాల కోసం ఆ సంస్థ ఇటీవలే ‘స్కేల్ ఏఐ’ సంస్థతో 14 బిలియన్ డాలర్ల (మన కరెన్సీలో రూ.1.2 లక్షల కోట్లు) ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే.. ఈ ప్రాజె క్టు నిర్వహణ కోసం ‘మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్’ అనే సంస్థను స్థాపించింది. ప్రపంచ ప్రఖ్యాత ఏఐ పరిశోధకులు, ఇంజనీర్లను ఆ సంస్థలోకి తీసుకుంటోంది. స్కేల్ ఏఐ సీఈవో అలెగ్జాండర్ వాంగ్, గిట్‌హబ్ మాజీ చీఫ్ నాట్ ఫ్రెడ్‌మన్ వంటివారిని ఇప్పటికే ఆ సంస్థలో నియమించుకున్నారు. యాపిల్, ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ నుంచి పెద్ద సంఖ్యలో ప్రతిభావంతులను చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యుత్తమ ప్రతిభావంతులకు రూ.850 కోట్ల దాకా ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నారు.
-సెంట్రల్ డెస్క్
1341 మెగావాట్లంటే...
మెటా అభివృద్ధి చేయనున్న సూపర్ క్లస్టర్ సామర్థ్యం 1341 మెగావాట్లు. అర్థమయ్యేలా చెప్పాలంటే.. మన ఇంట్లో తిరిగే సీలింగ్ ఫ్యాన్ సగటున 75 వాట్ల కరెంటును వినియోగించుకుంటుందనుకుంటే.. ఒకేసారి 1,80,00,000 (1.8 కోట్ల) ఫ్యాన్లు తిరిగితే ఎంత శక్తి ఖర్చవుతుందో అంత శక్తి! ఆ శక్తితో 1,34,10,000 టీవీలను ఒకేసారి చూడొచ్చు. 89 లక్షల 40 వేల రిఫ్రిజిరేటర్లను లేదా 6.7 కోట్ల ట్యూబ్‌లైట్లను పనిచేయించవచ్చు. దీనికే అంత శక్తి ఉందంటే.. 5 గిగావాట్ల సామర్థ్యం అంటే ఎంతో మీరే ఊహించుకోండి!!
ఇవి కూడా చదవండి
కాళేశ్వరం అవినీతి ఇంజినీర్లకు ఇక చుక్కలే..ఈడీ విచారణకు సిద్ధం..
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి