Raja Raghuvanshi murder case: మురుగుకాలువలో మారణాయుధం.. మరో కీలక ఆధారం లభ్యం
ABN , Publish Date - Jun 25 , 2025 | 09:43 PM
హత్య కేసు నిందితులలో ఒకరైన రియల్ ఎస్టేట్ వ్యాపారి షిలోమ్ జేమ్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జేమ్స్‌ను కూడా వెంటబెట్టుకుని వెళ్లి డ్రైన్‌లో గాలించగా ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది.

ఇండోర్: సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసు (Raja Raghuvanshi murder case)లో మేఘాలయ పోలీసులకు మరో కీలక సాక్ష్యం దొరికింది. ఇండోర్‌లోని పలాసియా ఏరియాలోని మురుగుకాలువ (Drain) నుంచి ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌ను పోలీసులు బుధవారం నాడు వెలికితీశారు.
హత్య కేసు నిందితులలో ఒకరైన రియల్ ఎస్టేట్ వ్యాపారి షిలోమ్ జేమ్స్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జేమ్స్‌ను కూడా వెంటబెట్టుకుని వెళ్లి డ్రైన్‌లో గాలించగా ప్లాస్టిక్ బ్యాగ్ బయటపడింది. ఇందులో ఏముందనేది అధికారికంగా మేఘాలయ పోలీసులు వెల్లడించనప్పటికీ ఈ కేసుకు సంబంధించిన ఒక ఫ్లాట్ నుంచి కనిపించకుండా పోయిన నాటు తుపాకీ ఇందులో ఉన్నట్టు ఇండోర్ పోలీసు వర్గాల సమాచారం. దీనికి ముందు, జేమ్స్ సమాచారంతోనే ఖాళీ స్థలంలో తవ్వగా కాలిపోయిన ఒక బ్యాగ్ సైతం బయటపడింది.
కాగా, పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధం, ఇతర వస్తువులను రాజా రఘువంశీ హత్య తర్వాత అతని భార్య సోనమ్ రఘువంశీ ఇండోర్‌లో బస చేసిన ఫ్లాట్ నుంచి బయటకు తరలించినట్టు చెబుతున్నారు. ఈ ఫ్లాట్‌ను కేసులో మరో నిందితుడైన విశాల్ చౌహాన్‌కు జేమ్స్ అద్దెకు ఇచ్చినట్టు గుర్తించారు. నిందితులు జేమ్స్, తోమర్, అహిర్వార్ ప్రస్తుతం మేఘాలయ పోలీసుల ట్రాన్సిట్ కస్టడీలో ఉన్నారు. వీరి నుంచి సమాచారం రాబట్టి తాజా ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.
రాజా రఘువంశీ, సోనమ్ వివాహం గత మే 11న జరిగింది. హనీమూన్ కోసం మే 23న ఇద్దరూ కలిసి మేఘాలయ వచ్చారు. జూన్ 2న ఈస్ట్ ఖాసి హిల్స్ జిల్లా సోహ్రా ప్రాంతంలోని ఒక లోతైన గుంటలో రాజా రఘువంశీ మృతదేహాన్ని కనుగొన్నారు. అనంతరం హత్య కేసులో ప్రమేయం ఉన్న సోనమ్, ఆమె బాయ్‌ఫ్రెండ్ కుష్వాహతో పాటు హత్యకు కుట్ర పన్నిన సహనిందితులు విశాల్ చౌహాన్, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మిలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రస్తుతం మేఘాలయలో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రెక్కలు మీవి, ఎగరడానికి పర్మిషన్ అడక్కండి.. ఖర్గే వ్యాఖ్యలపై శశిథరూర్
సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు
For National News And Telugu News