Delhi Bomb Blast: ఢిల్లీలో భారీ పేలుడు
ABN , Publish Date - Nov 11 , 2025 | 02:19 AM
దేశ రాజధాని ఢిల్లీ.. భారీ పేలుడుతో దద్దరిల్లింది! దేశంలోని అత్యంత హై ప్రొఫైల్ ప్రాంతాల్లో ఒకటి.. పంద్రాగస్టునాడు దేశ ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించే ఎర్రకోటకు సమీపంలో మెట్రోస్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం దాదాపు.....
ఎర్రకోట సమీపంలో పేలిన కారు
9 మంది మృతి 24 మందికి గాయాలు
ముగ్గురు విషమం.. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం
ఛిద్రమైన శరీరభాగాలతో ఘటనాస్థలి వద్ద భీతావహ దృశ్యాలు
పేలుడు ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న పలు వాహనాలు, దుకాణాలు
పేలుడు సమయంలో కారులో ఉన్న ముగ్గురి మృతి
ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా
ఘటనాస్థలికి హోం మంత్రి షా
ఆస్పత్రిలో క్షతగాత్రులకు పరామర్శ
ఉగ్రకుట్ర కోణంలోనూ ఎన్‌ఐఏ దర్యాప్తు
కారు కదలికలపై వివరాల కోసం సీసీటీవీ కెమెరాల జల్లెడ
న్యూఢిల్లీ, నవంబరు 10: దేశ రాజధాని ఢిల్లీ.. భారీ పేలుడుతో దద్దరిల్లింది! దేశంలోని అత్యంత హై ప్రొఫైల్ ప్రాంతాల్లో ఒకటి.. పంద్రాగస్టునాడు దేశ ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించే ఎర్రకోటకు సమీపంలో మెట్రోస్టేషన్ వద్ద సోమవారం సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో కారు పేలి 9 మంది మరణించగా.. 24 మంది తీవ్రంగా గాయపడ్డారు! క్షతగాత్రులను హుటాహుటిన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని.. గాయపడ్డవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఢిల్లీకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరియాణాలోని ఫరీదాబాద్‌లో 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకున్న రోజునే.. అదీ హరియాణా రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఉన్న కారులో పేలుడు జరగడంతో.. దీని వెనుక ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు, ఇతర కేంద్ర సంస్థల సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. పేలుడు ఽతీవ్రతకు ఘటనాస్థలి వద్ద భీతావహ దృశ్యాలు కనిపించాయి. మృతదేహాలు ఛిద్రమై శరీర భాగాలు చెల్లాచెదురుగా రోడ్డుపైన, పక్కనే ఉన్న వాహనాలపైనా పడ్డాయి. పేలుడు ధాటికి.. చుట్టూ ఉన్న వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆరు కార్లు, రెండు ఈ-రిక్షాలు, ఒక ఆటో అగ్నికి ఆహుతైపోయాయి. మొత్తం 22 కార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఘటనాస్థలికి సమీపంలోని పలు దుకాణాలు ధ్వంసమయ్యాయి. భవనాలు కంపించాయి. ఈ పేలుడు జరిగిన మూడు నిమిషాలకే అగ్నిమాపక శాఖకు ఫోన్ కాల్ వెళ్లింది. వెంటనే ఏడు యూనిట్ల అగ్నిమాపక సిబ్బంది 20 ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలార్పేందుకు రంగంలోకి దిగి.. 7.29 గంటలకల్లా.. అంటే పేలుడు జరిగిన 40 నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ పేలుడుకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఢిల్లీ పోలీసు కమిషనర్ సతీశ్ గోల్చా వెల్లడించారు. ‘‘సాయంత్రం 6.52 గంటలకు.. రెడ్‌ఫోర్ట్ మెట్రోస్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద ట్రాఫిక్ రెడ్ సిగ్నల్ పడడంతో నిదానంగా వచ్చిన ఒక కారు అక్కడ ఆగీ ఆగగానే పేలిపోయింది.
ఆ సమయంలో ఆ కారులో ప్రయాణికులున్నారు. పేలుడు ధాటికి దాని చుట్టుపక్కలున్న వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి’’ అని ఆయన తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసు బలగాలతోపాటు.. జాతీయ దర్యాప్తు సంస్థ, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, సీఆర్పీఎఫ్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సహా పలు ఏజెన్సీల అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు వివరించారు. పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తెలుపుతున్నట్టు వెల్లడించారు. పేలిపోయిన కారులో ముగ్గురు ఉన్నట్టు మరో సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘‘పేలుడు జరిగిన చోట ఎలాంటి గుంతా పడలేదు. పేలుడు ధాటికి గాయపడ్డవారి శరీరాల్లో ఎలాంటి పెల్లెట్లూ కనిపించలేదు. బాంబు పేలుడు అయితే ఇలా జరగడం అసాధారణం. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఆయన వివరించారు. అందులో భాగంగా.. ఆ కారు ఏయే ప్రాంతాల్లో తిరిగిందో తెలుసుకోవడానికి నగరంలోని అన్ని సీసీటీవీ కెమెరాలనూ జల్లెడపడుతున్నారు. పేలుడుకు ముందు ఏదైనా అనుమానాస్పదంగా కనిపించిందా? అని స్థానికులను, ప్రత్యక్షసాక్షులను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో పేలుడుకు ముందు నమోదైన ఫోన్‌కాల్స్ డేటాను విశ్లేషిస్తున్నారు.
కారెవరిది?
హరియాణా రిజిస్ట్రేషన్‌తో ఉన్న హ్యూందాయ్ ఐ20 కారులో పేలుడు జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ కారు నదీం అనే వ్యక్తి పేరిట ఉన్నట్టు సమాచారం. కారు యజమానిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిజానికి ఈ కారును ఏడాదిన్నర క్రితం సలీం అనే వ్యక్తి.. దేవేంద్ర అనే వ్యక్తికి విక్రయించాడని సమాచారం. గురుగ్రామ్ పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా.. దేవేంద్ర ఆ తర్వాత ఆ కారును హరియాణాలోని అంబాలకు చెందిన వ్యక్తికి అమ్మినట్టు తెలిసింది.
భయంతో పరుగులు..
‘‘అంత పెద్ద భారీ పేలుడు శబ్దాన్ని మా జీవితంలో ఎప్పుడూ వినలేదు’’ అని ఘటనాస్థలికి సమీపంలో ఉన్న ప్రత్యక్ష సాక్షులు పలువురు తెలిపారు. ‘‘పేలుడు జరిగిన సమయంలో నేను నా దుకాణంలో ఉన్నాను. పేలుడు ధాటికి నా కుర్చీలోంచి కింద పడిపోయాను. వెంటనే లేచి బయటకు పరుగెత్తాను. చాలామంది ఆ సమయంలో తలోదిక్కుకూ పరుగులు తీయడం కనిపించింది’’ అని అక్కడి ఒక దుకాణదారు చెప్పారు. ‘‘నేను మా ఇంటి టెర్రస్ మీద ఉండగా.. పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. చూస్తే దూరంగా అగ్ని జ్వాలలు. పేలుడు ధాటికి భవనాల కిటికీలు కదిలిపోయాయి’’ అని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు. పేలుడు ఘటనతో ఢిల్లీని అనుకుని ఉన్న యూపీ జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మతపరంగా, ఇతరత్రా సున్నితమైన ప్రార్థన మందిరాలు, ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
మా వాళ్లని చూడనివ్వట్లేదు..
ఈ పేలుడులో గాయపడ్డవారి కుటుంబసభ్యులు, బంధువులు.. విషయం తెలియగానే ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి చేరుకుని తమవారి కోసం ఆందోళనతో ఆరా తీశారు. గాయపడ్డ తమవారిని చూడ్డానికి ఆస్పత్రి సిబ్బంది తమను అనుమతించట్లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, పేలిన కారు కదలికల కోసం సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టిన పోలీసులు.. ఆ కారు దరియాగంజ్ మార్కెట్ నుంచి బయల్దేరి సాయంత్రం 4 గంటల సమయానికి సునెహ్రీ మసీదు పార్కింగ్ ఏరియా వద్దకు చేరుకున్నట్టు గుర్తించారు. అనంతరం ఆ కారు మళ్లీ ఛత్తా రైల్‌చౌక్ వద్ద యూటర్న్ తీసుకుని.. లోయర్ సుభాష్ మార్గ్ దిశగా వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. అక్కడ ఆ కారు సిగ్నల్ వద్దకు చేరుకుంటూ నెమ్మదించిందని.. అప్పుడు పేలుడు జరిగిందని ఓ అధికారి తెలిపారు. పేలుడు దెబ్బకు కారులో ఉన్న ముగ్గురూ ఛిద్రమైపోయారని తెలిపారు.
పేలుడుకు కారణం ఇప్పుడే చెప్పలేం..
పేలుడు ఘటనపై కేంద్రం హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీసు కమిషనర్‌తో, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, ఎన్‌ఐఏ చీఫ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పేలుడుకు కారణం ఏంటి అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అనంతరం ఆయన ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. అక్కణ్నుంచీ నేరుగా ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఇక.. సోమవారం రాత్రి 12 గంటల సమయానికి.. మృతుల్లో.. అశోక్, అమర్ అనే ఇద్దరిని మాత్రమే పోలీసులు గుర్తించారు. మిగతా మృతదేహాలు ఎవరివో ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ పేలుడు తమ పనేనని ఇంతవరకూ ఏ ఉగ్రసంస్థా ప్రకటించలేదు.


