Share News

Maoists Ceasefire Proposal: నెలరోజులపాటు కాల్పులు విరమిద్దాం

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:30 AM

మావోయిస్టులు 30 రోజుల పాటు కాల్పులు విరమించి, శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. చర్చలు ప్రారంభించేందుకు ఉమ్మడి కమిటీ ఏర్పాటుకు వారు అంగీకరించారు

Maoists Ceasefire Proposal: నెలరోజులపాటు కాల్పులు  విరమిద్దాం

  • ఆ తర్వాత శాంతి చర్చలకు సిద్ధమవుదాం

  • సంప్రదింపుల నిర్వహణకు ఉమ్మడి కమిటీ

  • ఆ కమిటీలో మా నాయకులు,అధికారులూ..

  • మరో లేఖ విడుదలచేసిన మావోయిస్టులు

రాయ్‌పూర్‌, ఏప్రిల్‌ 19 : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి చర్చల ప్రస్తావన తెచ్చారు. నెలరోజులపాటు పరస్పరం కాల్పుల విరమణ జరిపి, ఆ తర్వాత శాంతిచర్చలకు సిద్ధం అవుదామని ప్రతిపాదించారు. తిరుగుబాటుదారులతో సంప్రదింపులు మొదలుపెట్టాలంటూ ఛత్తీ్‌సగఢ్‌ ఉప ముఖ్యమంత్రి విజయ్‌ శర్మ తాజాగా చేసిన ప్రతిపాదనకు స్పందిస్తూ మావోయిస్టు పార్టీ వాయువ్య సబ్‌ జోనల్‌ బ్యూరో గత గురువారం లేఖ విడుదల చేసింది. విజయ్‌ శర్మ ప్రతిపాదనను ఆ లేఖలో మావోయిస్టులు స్వాగతించారు. ‘‘చర్చల వాతావరణం నెలకొనాలంటే ముందుగా నెలరోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలి. హింస ఏ సమస్యనూ పరిష్కరించలేదు. పరస్పర అవగాహన, చర్చల ప్రక్రియ ద్వారానే శాశ్వత శాంతి సాధ్యం. దీనికోసం ఉమ్మడి కమిటీని ఏర్పాటుచేయాలి. ఈ కమిటీలో ప్రభుత్వ అధికారులు, మా నాయకులు.. ఇద్దరూ ఉంటారు. చర్చల పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోకి భద్రతాబలగాలు రాకుండా ప్రభుత్వం కట్టడి విధించాలి. అయితే, శాంతి ప్రయత్నాల స్ఫూర్తికి విరుద్ధంగా భద్రతా బలగాలు ఇప్పటికీ కాంకేర్‌, బీజాపూర్‌, సుక్మాలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. చర్చల పట్ల ప్రాథమికంగా మా సమ్మతిని తెలిపిన తర్వాత కూడా ఆపరేషన్లు జరుపుతున్నాయి. ఈ నెల 12, 16 తేదీల్లో గిరిజనులను హతమార్చాయి. ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. శాంతి పునరుద్ధరణకు మా పార్టీ ఇచ్చిన పిలుపును ముందుకువెళ్లేందుకు, అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక సంస్థల సహకారం కోరుతున్నాం’’ అని ఆ లేఖలో మావోయిస్టులు కోరారు. కాగా, ఇదే కమిటీ శాంతి చర్చల ప్రతిపాదన చేస్తూ ఈ నెల ఎనిమిదో తేదీన తొలి లేఖను విడుదల చేసింది. ఆ తర్వాత మూడు రోజులకు దండేవాడ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా.. తుపాకులు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. అమిత్‌షా ప్రకటనను మావోయిస్టుల లేఖ పట్ల సానుకూల స్పందనగా భావించారు. తాజాగా ఛత్తీ్‌సగఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ ఆ లేఖపై నేరుగా స్పందిస్తూ.. తిరుగుబాటుదారులతో చర్చలు జరపాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ఈ కమిటీ రెండో లేఖను విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి నక్సల్‌ సమస్యను పూర్తిగా తుడిచిపెట్టేస్తామని ప్రకటించిన కేంద్రం, ఏడాదిన్నర కాలంగా కూంబింగ్‌ దాడులను తీవ్రతరం చేసిన విషయం తెలిసిందే.


బడేసెట్టి పంచాయతీకి రూ.కోటి సాయం

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్‌ విముక్త తొలి పంచాయతీగా సుక్మా జిల్లాలోని బడేసెట్టి రికార్డు సృష్టించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నజరానాకు ఎంపిక అయింది. సుక్మాలో శుక్రవారం 22 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోగా, వారిలో 11మంది బడేసెట్టి నుంచే ఉన్నారు. దీంతో ఈ పంచాయతీని నక్సల్‌ విముక్త పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మావోయిస్టుల కారణంగా ఆగిపోయిన అభివృద్ధి పనులను తిరిగి చేపట్టేందుకు ఇలాంటి పంచాయతీలకు రూ. కోటి సాయం చేస్తామని ఛత్తీస్‌గఢ్‌ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికోసం ఒక పథకం కూడా తెచ్చింది. స్థానికులు ముందుకొచ్చి తమ పంచాయతీలో స్వయంగా పనులు చేసుకునేందుకుగాను ఈ సాయం అందిస్తారు. కాగా, మావోయిస్టుల కారణంగా తమ పంచాయతీ అభివృద్ధికి దూరమైందని బడేసెట్టి సర్పంచ్‌ కాల్మూ జోగా తెలిపారు. బడేసెట్టిలో 2021లో సెక్యూరిటీ క్యాంపు ఏర్పాటు చేసినప్పటినుంచే తాము శాంతిగా జీవిస్తున్నామని జోగా చెప్పారు. ‘‘భద్రతా బలగాల వల్ల మాకు రోడ్లు వచ్చాయి. అభివృద్ధి పనులు మొదలయ్యాయి. అప్పటినుంచి మావోయిస్టులు మా దగ్గరకు రావడం తగ్గింది. మా పంచాయతీ పరిధిలోని ఎనిమిది గూడేల్లో ఇప్పుడు ఆరు చోట్ల కరెంటు వచ్చింది. మిగతా రెండు గూడేల్లో విద్యుత్‌ సరఫరా పనులు సాగుతున్నాయి.’’ అని వివరించారు. ఈ పంచాయతీలో 1700 మంది జీవిస్తుండగా, వారిలో 1400 మందికి ఓటుహక్కు ఉందని కాఫ్‌ మొదటి బెటాలియన్‌ కంపెనీ కమాండర్‌ జమూనా కుమార్‌ రజాక్‌ తెలిపారు.

12 డంప్‌లు స్వాధీనం

ఛత్తీస్‌గఢ్‌ జిల్లా బీజాపూర్‌లో మావోయిస్టులకు చెందిన 12 డంపులను భద్రతాబలగాలు వెలికితీశాయి. బంకర్‌ని పోలిన గది ఇందులో ఒకటి. ఈ బంకర్‌ 160 చదరపు అడుగులు ఉంది. దాని పైభాగానికి కాంక్రీట్‌తో శ్లాబ్‌ వేశారు. అక్కడా, మిగతా డంపుల్లో ఆరు సోలార్‌ పలకలు, రెండు యూనిఫామ్‌లు, రెండు సీలింగ్‌ ఫ్యాన్లు, ఇతర సామగ్రిని బలగాలు గుర్తించి.. ధ్వంసం చేశాయి.

Updated Date - Apr 20 , 2025 | 04:30 AM