Manda Krishna Madiga: ధర్మం, విశ్వాసాల ముసుగులో దాడులు చేస్తే గుణపాఠం నేర్పుతాం: మందకృష్ణ మాదిగ..
ABN , Publish Date - Nov 17 , 2025 | 09:11 PM
ధర్మం, విశ్వాసాల ముసుగులో దళితులపై దాడులు చేస్తున్న వారికి తగిన గుణపాఠం నేర్పుతామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడిని దేశంలోని 30 కోట్ల మంది దళితులపై దాడిగా భావిస్తున్నట్లు ఆయన అభివర్ణించారు.
ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషన్ రామకృష్ణ గవాయ్ (Bhushan Ramkrishna Gavai)పై జరిగిన దాడిని దేశంలోని 30 కోట్ల మంది దళితులపై దాడిగా తాము భావిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వకుండా విశ్వాసాలు, ధర్మాల ముసుగులో ఎవరైతే ఎస్సీలపై దాడులకు పాల్పడుతున్నారో, అవమానిస్తున్నారో వారిని దళిత సంఘం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. సీజేఐ గవాయ్‌పై బూటు దాడి (Attack On CJI Gavai)ని నిరసిస్తూ మందకృష్ణ.. ఢిల్లీ జంతర్ మంతర్‌లో పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతు తెలుపుతూ దళిత సంఘాల నేతలు, కార్యకర్తలు భారీగా ఢిల్లీకి చేరుకుని ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ..'ధర్మం, విశ్వాసాల ముసుగులో దళితులపై దాడి చేస్తున్న వారికి గుణపాఠం నేర్పుతాం. నిన్న (ఆదివారం) అమరావతిలో గవాయ్ మాట్లాడుతూ.. రాజ్యాంగం వచ్చిన తర్వాతే తనలాంటి దళితుడు చీఫ్ జస్టిస్ అయ్యారని చెప్పారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారానే ఇవ్వన్ని సాధ్యమయ్యాయి. రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రలు ఈ దేశంలో జరుగుతున్నాయి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. అంతేకాకుండా 30కోట్ల మంది దళితులను అవమానించడం, చిన్నచూపు చూడడం, కించపరిచేలా ఈ దేశంలో సంఘటనలు జరుగుతున్నాయి. చట్టాల ముందు అందరూ సమానమై ఉంటే చీఫ్ జస్టిస్‌పై దాడి జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదు.
చట్టాలు వారికి వర్తించవా?. దాడి చేసిన వ్యక్తిపై ఎందుకు కేసు పెట్టలేదు?. జార్ఖండ్ హైకోర్టులో జడ్జిపై ఒక న్యాయవాది వ్యాఖ్యలు చేస్తే కేసు పెట్టారు. తెలంగాణలో ఓ రౌడీషీటర్ ఎన్‌కౌంటర్ అయితే దానిపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఆధర్మం ఈ ధర్మం పేరిట మమ్మల్ని ఊరికి దూరంగా నెట్టివేశారు. మాకు చదువు, గౌరవం లేకుండా చేసేందుకు పాత వ్యవస్థను తిరిగి తీసుకొచ్చే విధంగా పరిస్థితి ఉంది. అద్దెకు ఉండేందుకు దళితులకు ఇల్లు ఇవ్వమని కరీంనగర్‌లో కొందరు బోర్డు పెట్టారు. దేశంలో ఇంకా అంటరానితనం కొనసాగుతోంది. సీజేఐ జస్టిస్ గవాయ్‌పై దాడి చేసిన వారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే' అని డిమాండ్ చేశారు.
Also Read:
బైకర్లపై రెచ్చిపోయిన బిహార్ పోలీస్.. వీడియో వైరల్.!
వామ్మో.. ఎలాన్ మస్క్ ట్రోల్ చేస్తే దిమ్మతిరగాల్సిందే.. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓకు షాక్