Vande Bharat Video: రైలులో ఎమ్మెల్యే దౌర్జన్యం.. సీటు మార్చుకోలేదని..
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:11 PM
Vande Bharat Video: ఎమ్మెల్యే అనుచరుల దాడిలో ఆ వ్యక్తి ముక్కుకు దెబ్బ తగిలింది. రక్తం బొటబొటా కారింది. ఆ రక్తంతో చొక్కా మొత్తం తడిసిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దాడి తర్వాత ఎమ్మెల్యేనే బాధితుడిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వందే భారత్ రైలులో ఓ ఎమ్మెల్యే .. ప్రయాణికుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. సీటు మార్చకోలేదన్న కోపంతో తన అనుచరులతో కొట్టించాడు. ఎమ్మెల్యే అనుచరుల దాడిలో ఆ ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఢిల్లీ-భోపాల్ వందే భారత్ రైలులో ఆలస్యంగా వెలుగుచూసింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఝాన్సీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ తన భార్య, కొడుకుతో కలిసి ఢిల్లీ-భోపాల్ వందే భారత్ రైలు ఎక్కాడు. అయితే, ఆ ఎమ్మెల్యేకు కంపార్ట్‌మెంట్ చివరన సీటు కేటాయించబడింది.
ఆయన భార్య, కొడుక్కు కంపార్ట్‌మెంట్ ముందు భాగంలో సీట్లు కేటాయించబడ్డాయి. భార్య, కొడుకు దగ్గర కూర్చోవాలని ఎమ్మెల్యే అనుకున్నాడు. వారి పక్క సీటులో ఉన్న వ్యక్తిని సీటు మారమని అడిగాడు. ఇందుకు అతడు ఒప్పుకోలేదు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యాడు. తన అనుచరులకు విషయం చెప్పాడు. రైలు ఝాన్సీకి రాగానే ఎమ్మెల్యే అనుచరులు కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చారు. సీటు మార్పుకు ఒప్పుకోని వ్యక్తితో గొడవ పెట్టుకున్నారు. తర్వాత విచక్షణా రహింతంగా అతడిపై దాడి చేసి కొట్టారు.
ఆ వ్యక్తిని చెప్పులతో కూడా కొట్టడం గమనార్హం. ఎమ్మెల్యే అనుచరుల దాడిలో ఆ వ్యక్తి ముక్కుకు దెబ్బ తగిలింది. రక్తం బొటబొటా కారింది. ఆ రక్తంతో చొక్కా మొత్తం తడిసిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. దాడి తర్వాత ఎమ్మెల్యేనే బాధితుడిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే తన కంప్లైంట్‌లో.. ‘నేను నా భార్య, కొడుకుతో రైలులో ప్రయాణిస్తూ ఉన్నాను. అతడు నా భార్యతో తప్పుగా ప్రవర్తించాడు’ అని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీటు విషయంలోనే గొడవ జరిగినట్లు గుర్తించారు. సీసీటీవీ ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం
అందుకే గ్యాస్ సిలిండర్‌తో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇంతే..