PM Modi: బిహార్ విజయం.. ఆల్ టైమ్ రికార్డ్: ప్రధాని మోదీ..
ABN , Publish Date - Nov 14 , 2025 | 08:17 PM
బిహార్ ప్రజలు ఎన్డీయేకు చారిత్రక తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కట్టా సర్కార్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదంటూ విపక్ష కూటమికి చురకలు అంటించారు.
న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వానికి ప్రజామోదం ఉండటం వల్లే బిహార్‌లో ఘనవిజయం సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బిహార్‌లో ఎన్డీయే సర్కార్ అఖండ విజయం సాధించడంతో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానికి పార్టీ కార్యాలయం వద్ద ఘనస్వాగతం లభించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ ఎన్డీయే సుమారు 202 సీట్లు కైవసం చేసుకోగా.. తేజస్వి సారథ్యంలోని మహాగఠ్‌బంధన్ కేవలం 35 సీట్లతో ఘోర వైఫల్యాన్ని చవిచూసింది.
కట్టా సర్కార్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదు
బిహార్ ప్రజలు ఎన్డీయేకు చారిత్రక తీర్పు ఇచ్చారని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. కట్టా సర్కార్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని విపక్ష కూటమికి చురకలు అంటించారు. భవిష్యత్తులో అసాధారణమైన అభివృద్ధిని రాష్ట్రం చూడనుందని భరోసా ఇచ్చారు. ఎన్డీయేకు 2010 తర్వాత అసాధారణమైన తీర్పును ఈరోజు ప్రజలు ఇచ్చారని, ఎన్డీయేలోని అన్ని పార్టీల తరఫున తాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. బిహార్‌లోని కొన్ని పార్టీలు బుజ్జగింపు రాజకీయాల కోసం మహిళలు, యూత్ (MY)ను వాడుకునే వారని, అయితే ఈ ఫార్ములా ఇప్పుడు బెడిసికొట్టిందని అన్నారు.
దేశంలో యువ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ ఒకటని, ఇందులో అన్ని కులాలు, మతాలకు చెందిన వారున్నారని మోదీ చెప్పుకొచ్చారు. వారి కోరికలు, ఆకాంక్షలు, కలలకు గతంలోని జంగిల్‌రాజ్ సర్కార్ గండికొట్టిందని చెప్పారు. ఇప్పుడు ప్రజలు బిహార్ అభివృద్ధికి ఓటు వేశారని అన్నారు. తన ప్రచారంలో రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని తాను విజ్ఞప్తి చేశానని, అందుకు తగినట్టుగానే అన్ని రికార్డులను ఓటర్లు బ్రేక్ చేశారని ప్రశంసించారు. గౌరవప్రదమైన బీహార్‌కే తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
జైలుకు వెళ్లినా.. 28,000 ఆధిక్యంతో గెలుపు..
ఎన్డీయే విజయంపై నీతీష్‌కు మోదీ అభినందనలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..