Compulsory Hindi Move: మహా సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భాషా ప్యానల్
ABN , Publish Date - Apr 20 , 2025 | 04:46 PM
భాషా వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వివరణ ఇచ్చారు. మరాఠీ అనేది చర్చనీయాంశమే కాదని, అందరూ తప్పనిసరిగా నేర్చుకావాలని, వేరే భాషలు నేర్చుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక అని అన్నారు.

ముంబై: ఒకటో తరగతి నుంతి ఐదో తరగతి వరకూ హిందీ భాషను విధిగా బోధించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి చుక్కెదురైంది. ఈ నిర్ణయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వ భాషా సంప్రదింపుల కమిటీ (Maharashtra Language consultaion committee) ఏకగ్రీవంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని ప్యానల్ చీఫ్ లక్ష్మీకాంత్ దేశ్‌ముఖ్ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు రాసిన ఒక లేఖలో కోరారు.
Devendra Fadnavis: దగ్గరవుతున్న థాకరే సోదరులు.. దేవేంద్ర ఫడ్నవిస్ స్పందనిదే
జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకూ మరాఠీ, ఇంగ్లీషుతో పాటు మూడో భాషగా హిందీని విధిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 17న నిర్ణయించింది. పాఠశాల విద్యా విభాగం ఏప్రిల్ 16న ఈ నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT) డెరెక్టర్ రాహుల్ అశోక్ రేఖావార్ తెలిపారు. విద్యార్థులు ఇందువల్ల తప్పనిసరిగా లబ్ధి పొందుతారని చెప్పారు. కాగా, హిందీని విధిగా బోధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఫడ్నవిస్ వివరణ
ఈ వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వివరణ ఇచ్చారు. మరాఠీ అనేది చర్చనీయాంశమే కాదని, అందరూ తప్పనిసరిగా నేర్చుకావాలని, వేరే భాషలు నేర్చుకోవడం వారి వ్యక్తిగత ఎంపిక అని అన్నారు. ''మహారాష్ట్రలో మరాఠా తప్పనిసరి. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. అదనంగా, ఇతర భాషలు నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు. హిందీపై వ్యతిరేకత, ఇంగ్లీషుపై పెరుగుతున్న ప్రాధాన్యత ఆశ్చర్యం కలిగిస్తోంది. మరాఠీని ఎవరైనా వ్యతిరేకిస్తే మాత్రం సహించేది లేదు'' అని అన్నారు.
మహా వికాస్ అఘాడి నిరసన
అధికార మహాయుతి ప్రభుత్వ నిర్ణయంపై విపక్ష మహా వికాస్ అఘాడి (MVA) ఆక్షేపణ తెలిపింది. ఎన్‌సీపీ నేత సుప్రియ సూలే మాట్లాడుతూ, మహారాష్ట్రలో సీబీఎస్‌సీ బోర్డు తప్పనిసరి చేస్తూ విద్యాశాఖ మంత్రి చేసిన ప్రకటనను మొదటగా వ్యతిరేకించనది తానేనని, ప్రస్తుతం ఉన్న స్టేట్ బోర్డ్ స్థానే సీబీఎస్‌సీను ఎందుకు తీసుకురావాలని ఆమె ప్రశ్నించారు. భాష గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ముందు రాష్ట్రంలో కనీస విద్యా సదుపాయల గురించి తప్పనిసరిగా మాట్లాడుకోవాలని అన్నారు.
ప్రేమతో అడగాలే కానీ..
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ, ప్రేమతో అడిగితే ఏదైనా చేయడానికి సిద్ధమేనని, అయితే బలవంతంగా రుద్దాలని వాళ్లు (మహాయుతి) ప్రయత్నిస్తే తాము వ్యతిరేకిస్తామని అన్నారు. హిందీ నేర్చుకోవాలంటూ ఎందుకు బలవంతం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఇదే తరహా అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ వ్యక్తం చేశారు. రాష్ట్రంపై హిందీని ఎవరి తరఫున బలవంతంగా రుద్దాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఆప్షన్‌గా దానిని ఉంచవచ్చని, తప్పనిసరి చేయడం మాత్రం సరికాదని అన్నారు.
ఇవి కూడా చదవండి..