Maharashtra: మహాసర్కార్ సంచలన నిర్ణయం.. రెండు జీఆర్‌ల ఉపసంహరణ
ABN , Publish Date - Jun 29 , 2025 | 09:32 PM
ఫడ్నవిస్ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం ఏప్రిల్ 16న జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం (జీఆర్) ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకూ ఇంగ్లీషు, మరాఠీ మీడియం స్కూళ్లలో హిందీ తప్పనిసరి. అయితే దీనిపై వ్యతిరేకత వ్యక్తం కావడంతో జూన్ 17న సవరించిన జీఆర్‌ను జారీ చేసింది.

ముంబై: మహారాష్ట్ర స్కూలు పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరిగా చేయడంపై తీవ్ర దుమారం రేగడంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన రెండు ప్రభుత్వ తీర్మానాలను (Government Resolutions - GR) ఉపసంహరించుకునేందుకు మంత్రివర్గం ఆదివారంనాడు నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో త్రిభాషా ఫార్ములా అమలుపై చర్చించేందుకు విద్యావేత్త డాక్టర్ నరేంద్ర జాదవ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. కమిటీ నివేదిక సమర్పించేంత వరకూ ఏప్రిల్ 16, జూన్ 17న తీసుకున్న జీఆర్‌లను ప్రభుత్వం రద్దు చేస్తోందని తెలిపారు.
ఫడ్నవిస్ సారథ్యంలోని మహాయుతి ప్రభుత్వం గత ఏప్రిల్ 16న జారీ చేసిన ప్రభుత్వ తీర్మానం (జీఆర్) ప్రకారం 1 నుంచి 5వ తరగతి వరకూ ఇంగ్లీషు, మరాఠీ మీడియం స్కూళ్లలో హిందీని తప్పనిసరి. అయితే, ప్రాంతీయ పార్టీలు విద్యావేత్తలు, తల్లిదండ్రులు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో జూన్ 17న సవరించిన జీఆర్‌ను జారీ చేసింది. ఆ ప్రకారం, ఐచ్ఛికంగా హిందీని ఎంచుకునే వీలు కల్పించింది. అయితే, తాజాగా డాక్టర్ జాదవ్ కమిటీ నివేదిక వచ్చేందుకు ఆ రెండు జీఆర్‌లను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పుడు నిరసనల అవసరం లేదు: అజిత్ పవార్
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ, త్రిభాషా ఫార్ములాకు వ్యతిరేకంగా ప్రతిపాదిత నిరసనలను విపక్ష నేతలు, యాక్టివిస్టులు ఉపసంహరించుకోవాలని కోరారు. హిందీని తప్పనిసరి చేసే వివాదాస్పద జీఆర్‌లను ఇప్పుడు అధికారికంగా ఉపసంహరించుకున్నట్టు చెప్పారు.
జూలై 5న విపక్షాల మార్చ్ రద్దు
కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయంతో హిందీని తప్పనిసరి చేసే ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా జూలై 5న సంయుక్తంగా మార్చ్ నిర్వహించేందుకు విపక్షాలు తలపెట్టిన కార్యక్రమానికి ఉపసహరించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సంయుక్త మార్చ్ కోసం ఏకతాటిపైకి రావాలన్న శివసేన (యూబీటీ), రాజ్‌థాకరే ఎంఎన్ఎస్ ప్రయత్నాలకు ప్రభుత్వ నిర్ణయం ముకుతాడు వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి..
2026 ఏప్రిల్ 1 నుంచి ఇళ్ల లెక్కింపుతో జనాభా గణన షురూ
విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణాన్ని తోసిపుచ్చలేం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి